జీజీహెచ్‌లో మత కార్యకలాపాలపై నిషేధం | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో మత కార్యకలాపాలపై నిషేధం

Aug 12 2025 7:39 AM | Updated on Aug 13 2025 5:40 AM

జీజీహెచ్‌లో మత  కార్యకలాపాలపై నిషేధం

జీజీహెచ్‌లో మత కార్యకలాపాలపై నిషేధం

అధికారులు, సిబ్బందికి సర్క్యులర్‌ జారీ

కాకినాడ క్రైం: జీజీహెచ్‌లో ఎప్పటికప్పుడు తీవ్ర వివాదాలకు కారణమవుతున్న మత కార్యకలాపాలపై నిషేధాన్ని విధిస్తూ కలెక్టర్‌ షణ్మోహన్‌ సూచనలతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్‌సీ.నం.18/ఏవో/2025తో సర్క్యులర్‌ జారీ చేశారు. అంతకుముందు హెడ్‌ నర్సులు, ఆసుపత్రి అధికారులతో సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ సూత్రాలకు లోబడి లౌకికవాదం అనుసరించాల్సిన ఆసుపత్రి, ఆవరణలో, తటస్థత, సమగ్రత తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్డులు, కార్యాలయాలతో పాటు ఆసుపత్రి సంబంధిత ఇతర ప్రాంతాలలో మతపరమైన కార్యకలాపాలు అంటే పూజలు, ప్రార్థనలు, ఉత్సవాలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రచారాలు, బోధనలు నిర్వహించడం, ప్రోత్సహించడం, వాటిలో పాల్గొనడం పూర్తిగా నిషేధం. మత సంబంధిత పుస్తకాలు, కరపత్రాలు, బ్యానర్లు, చిత్రాలు, వాల్‌ పోస్టర్లు చూపడం, పంచడం చేయకూడదు. ఈ ఆదేశాలు ఆసుపత్రి సిబ్బంది, అధికారులు, మెడికల్‌, పారామెడికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌, సహాయక, అనుబంధ విభాగాలలో పనిచేస్తున్న వారితోపాటు ఆసుపత్రిలోకి ప్రవేశించే ఇతరులకూ వర్తిస్తాయి. ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఎయిడ్స్‌ నియంత్రణ

పోస్టర్‌ ఆవిష్కరణ

కాకినాడ సిటీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో డిస్ట్రిక్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టాటజీ ఫర్‌ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ అనుసంధానంతో ఇంటెన్సిఫైడ్‌ ఐఈసీ క్యాంపెయిన్‌ ప్రోగ్రామ్స్‌ పోస్టర్‌ను కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. హైరిస్క్‌ మండలాల్లోని గ్రామాల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాప్తి నివారణ, ఉన్న అపోహలు తొలగించినందుకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ వివరించారు. హెచ్‌ఐవి జీవిస్తున్న వారికి మందులు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నామన్నారు. యువతలో హెచ్‌ఐవి ఎయిడ్స్‌పై పూర్తి అవగాహన కలిగించేందుకు జిల్లాలో ఉన్న కాలేజీల్లో, హైస్కూళ్లలో రెడ్‌ రిబ్బన్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ 1097 టోల్‌ఫ్రీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. జేసీ రాహుల్‌ మీనా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె.నరసింహనాయక్‌, జిల్లా లెప్రసీ ఎయిడ్స్‌ అండ్‌ టీబీ అధికారి ఐ ప్రభాకరరావు, జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పి బాలాజీ పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 441 అర్జీలు

కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ సోమవారం కాకినా కలెక్టరేట్‌లోని వివేకానంద హాలులో నిర్వహించారు. కలెక్టర్‌ షణ్మోహన్‌, జేసీ రాహుల్‌ మీనా, ట్రైనీ కలెక్టర్‌ మానీషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, హౌసింగ్‌ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎ శ్రీనివాసు, సీపీవో పి త్రినాథ్‌లతో కలిసి హాజరై ప్రజల నుంచిఅర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలపై విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్‌, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం ఆన్‌లైన్‌ సమస్యలు వంటి అంశాలకు చెందిన మొత్తం 441 అర్జీలు అందాయి.

పారదర్శకంగా

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ పారదర్శకంగా జరుగుతుందని విశాఖ ఆర్మీ విభాగం సోమవారం ఒక ప్రకటలో తెలిపింది. విశాఖ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఈనెల 5 న ప్రారంభమైన ఈ ర్యాలీ 21 వరకు కొనసాగుతుందన్నారు. అగ్రివీర్‌ విభాగాల్లో స్టోర్‌ కీపర్‌, టెక్నికల్‌ క్లర్క్‌, జనరల్‌ డ్యూటీ, ట్రేడ్స్‌ మెన్‌ విభాగాలకు ఈ రిక్రూట్‌మెంట్‌ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌, లోకల్‌ ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో మెరిట్‌ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement