నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యాన సోమవారం నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ నుంచి ఆదేశాలు వచ్చాయి. వేసవి సెలవుల్లో విద్యార్థుల సమయం వృథా కాకుండా, వారిలో పఠనాశక్తిని కలిగించి, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ శిబిరాల నిర్వహణకు జిల్లా గ్రంథాలయ సంస్థ సమాయత్తమైంది. వివిధ అంశాలపై 40 రోజుల పాటు ఈ శిక్షణ ఇస్తారు. తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ అని షెడ్యూల్ ప్రకటించినా, వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ మాత్రమే నిర్వహించనున్నారు. పఠనం, సరదా అనే రెండు విభాగాల్లో శిక్షణ ఉంటుంది. పుస్తక పఠనం, కథలు చెప్పించడం, ప్రముఖులతో అవగాహన సదస్సులు, ఆటలపై ఆసక్తి ఉన్నవారికి చెస్, క్యారమ్స్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. అలాగే విజేతల పుస్తకాలతో పాటు కవులు, స్వాతంత్య్ర సమర యోధుల జీవిత విశేషాలు, వివిధ దినపత్రికలు, చిన్నారులకు ఉపయోగపడే పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. నృత్యం, పప్పెట్ల తయారీ వంటి వాటిపై కూడా శిక్షణ ఇవ్వచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సమీప గ్రంథాలయాలను సంప్రదించాలి. వేసవి సెలవుల్లో పిల్లలు గ్రంథాలయాలకు వచ్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వీఎల్‌ఎన్‌ఎస్‌వీ ప్రసాద్ కోరారు. విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించి, నిత్యం శిక్షణకు వచ్చేలా చూడాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. స్పోకెన్ ఇంగ్లిష్, చెస్, చిత్రలేఖనం వంటి అంశాల్లో స్వచ్ఛందంగా శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ముందుకు రావాలని కోరారు. ఈ శిక్షణకు గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు దాదాపు రూ.12 లక్షలు కేటాయించారని, ఈ ఏడాది నిధుల కేటాయింపుపై ఉత్తర్వులు రావాల్సి ఉందని చెప్పారు.


