అలంపూర్: నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కోరారు. గురువారం జిల్లా ఇరిగేషన్‌శాఖ కార్యాలయంలో ఎస్‌ఈ శ్రీనివాసులుతో ఆయన సమావేశమై నెట్టెంపాడు పెండింగ్ పనులపై చర్చించారు. ప్రధానంగా 99, 100, 106 ప్యాకేజీలకు సంబంధించిన అసంపూర్తి పనుల పూర్తికి అవసరమైన నిధుల కోసం సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించే విధంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఉన్న చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ.. సమస్యలు ఉత్పన్నమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రైతాంగానికి సాగునీటిని అందించడానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు.


