మిల్లర్ల జేబులో
అధికారులా?
సాధారణంగా అక్రమాలకు పాల్పడిన ఎవరైనా అధికారుల పట్ల భయంతో ఉంటారు. ఎక్కడా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతారో అని. కానీ జిల్లాలో మాత్రం అక్రమాలకు పాల్పడిన రైస్‌మిల్లర్లు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహస్తున్నారు. అధికారులదేముంది.. మా జేబుల్లోనే ఉన్నారు. వారికి కావాల్సిన డబ్బులు పడేస్తే మావైపు కన్నెత్తి కూడా చూడటానికి భయపడతారంటూ బాహాటంగానే ప్రచారం చేసుకుంటున్నారంటే ఇక్కడి అధికారుల పరిస్థితి ఏస్థాయిలో దిగజారిపోయిందో స్పష్టమవుతోంది. ఇందులో ప్రధానంగా సివిల్ సప్లయ్‌శాఖలో కీలకంగా పనిచేస్తున్న ఇద్దరు జిల్లా అధికారులు, రెవెన్యూ శాఖకు చెందిన మరో ఉన్నతాధికారిపై ఇలాంటి ఆరోపణలు వినిపిస్తుండటం కొసమెరుపు.
గద్వాల: అక్రమాలకు పాల్పడుతున్న రైస్మిల్లర్లపై కేసులు నమోదు చేసి, మెక్కిన ప్రభుత్వ ధాన్యాన్ని కక్కించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అక్రమార్కులు ఇచ్చే ముడుపులకు మోజు పడి, ప్రజాసొమ్ము ఏమైతే తమకేంటనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అక్రమాలకు పాల్పడిన ఓ రైస్‌మిల్లర్ కేసులకు భయపడతామా..? ఆ అధికారి నా జేబులోనే ఉన్నాడు.. నాకేం కాదనే తరహాలో బాహాటంగానే ప్రచారం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలో గతంలోనే సుమారు రూ. 60కోట్ల విలువైన ధాన్యం మాయం కాగా.. తాజాగా 2025–26 వానాకాలానికి సంబంధించి మరో రూ. 30కోట్ల ధాన్యాన్ని మిల్లర్లు మింగేశారు. అయితే అధికారులు కేసులు నమోదు చేసి మమ అనిపించారు తప్పితే.. మింగేసిన ప్రజా సొమ్మును ఎలా కక్కించాలో మర్చిపోయారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.కోట్ల విలువైన ధాన్యం పక్కదారి
ప్రభుత్వం రూ. వేలకోట్లు వెచ్చించి రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. రైస్‌మిల్లర్లు సీఎంఆర్ పేరుతో సివిల్ సప్లయ్‌శాఖ అధికారులతో జత కలిసి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఇదివరకే కేటీదొడ్డి మండలంలో సుమారు రూ. 40కోట్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించగా.. శాంతినగర్, కాకులారం, అయిజలలో మరో రూ. 13కోట్ల ఽవిలువైన ధాన్యాన్ని మాయం చేశారు. తాజాగా గద్వాల మండలం కొత్తపల్లిలోని ఫరీదా రైస్‌మిల్లు, అయిజలోని శ్రీనివాస రైస్‌మిల్లు, ఎర్రవల్లి మండలం దువాసిపల్లిలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి మాడ్రన్ రైస్‌మిల్లు, ఉండవెల్లిలోని శ్రీగోదా రంగనాథస్వామి పారాబాయిల్డ్ రైస్‌మిల్లు, అలంపూర్‌లోని జోగుళాంబ రైస్‌మిల్లులకు చెందిన మిల్లర్లు సుమారు రూ. 30కోట్ల విలువైన ధాన్యాన్ని మింగేశారు. వీరిపై అధికారులు ఎప్పటిలాగే కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు.
అధికారులు మా జేబుల్లోనే ఉన్నారు!
బాహాటంగా ప్రచారం చేస్తున్న రైస్‌మిల్లర్లు
కేసుల నమోదుతోనే మమ అనిపిస్తున్న అధికారులు
అక్రమార్కులతో జత కలిసి..
ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాల్సిన జిల్లా అధికారులు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ప్రతినెలా మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి, ధాన్యం నిల్వల లెక్కలు సరిచూడాల్సి ఉండగా.. తమ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా రైస్‌మిల్లర్లతో జతకలిసి తిరుగుతున్నారు. విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఇచ్చినప్పటికీ తాత్సారం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లతో బేరసారాలు చేస్తూ, వసూళ్లకు తెగబడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎవరిని ఉపేక్షించేది లేదు..
ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యంలో అక్రమాలకు పాల్పడిన రైస్మిల్లర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేశాం. వారి నుంచి ఆర్ఆర్ యాక్టు ద్వారా రికవరీ చేస్తాం. అదేవిధంగా అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులపై విచారణ జరి పి చర్యలు తీసుకుంటాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. – రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్


