గద్వాల క్రైం: ‘‘బహిరంగ మార్కెట్ ధరల కంటే రూ.800 ఎక్కువగా ఇస్తాం.. మీ గ్రామానికే వచ్చి కొనుగోలు చేస్తాం.. రవాణా ఖర్చులు ఉండవు..’’ అంటూ దళారులు రైతులను నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలతో క్వింటాకు 20 నుంచి 30 కేజీల పత్తిని కాజేస్తున్నారు. అనుమానం వచ్చిన రైతులు ధర్మకాంటాతో తూకం వేయగా.. దళారులు చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని గద్వాల, ధరూరు, శాంతినగర్, రాజోళి, అయిజ, మానవపాడు, ఇటిక్యాల, మల్దకల్ తదితర మండలాల్లో రైతులు అధికంగా పత్తి పండించారు. అయితే చిన్న, సన్నకారు రైతులు మార్కెట్‌లో పత్తిని విక్రయించేందుకు రవాణా, ఇతరాత్ర ఖర్చులు ఉంటాయని గ్రామాల్లోనే ప్రైవేటు వ్యాపారులకు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు రైతుల వద్దకు వెళ్లి మార్కెట్‌లో ఇచ్చే ధర కంటే అధికంగా ఇస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు.
పట్టని అధికారులు..
గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో తూకాల్లో మోసాలు నిత్యకృత్యమయ్యాయి. కట్టడి చేయాల్సిన అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ కాంటాల పరిశీలన, తూకాల్లో వ్యత్యాసంపై నిరంతరం తనిఖీలు చేయాల్సిన తూనికలు, కొలతలశాఖ అధికారుల నిర్లక్ష్యం వ్యాపారులకు కలిసివస్తోంది.
దొంగ వ్యాపారులపై చర్యలేవి..
గద్వాల మండలం పూడూరులో వ్యాపారుల మోసాన్ని గుర్తించిన రైతులు పత్తి వాహనాలను నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే మోసానికి పాల్పడిన వ్యాపారులు అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి అనుచర వర్గం కావడంతో రాజీ చర్చలు సాగాయి. రైతులు సైతం ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత వ్యాపారులు పూర్తిస్థాయిలో తూకం వేసి, రైతులకు నగదు చెల్లించారు. దీంతో మోసానికి యత్నించిన వ్యాపారులపై ఎలాంటి చర్యలు లేకుండాపోయాయి. వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నా అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొంది.
జిల్లా కేంద్రంలో పత్తి తూకం వేసేందుకు వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ కాంటా
తాజాగా వెలుగుచూసినవ్యవహారం..
అలంపూర్‌కు చెందిన కొందరు వ్యాపారులు ఈ నెల 14న గద్వాల మండలం పూడూరులోని 30 మంది రైతులతో 470 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసేందుకు వచ్చారు. క్వింటాకు రూ. 9,300 ధర చెల్లిస్తామని రైతులతో ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఎలక్ట్రానిక్ కాంటాలతో తూకం వేసి గూడ్స్ వాహనాల్లో తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కొందరు రైతులు తూకాల్లో మోసం జరిగిందని గుర్తించి.. జిల్లా కేంద్రంలోని ధర్మకాంటా వద్ద తూకం వేయడంతో అసలు మోసం బయటపడింది. అక్కడి నుంచి రైతులు నేరుగా పత్తి వాహనాలను రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. అప్పటికే వ్యాపారులు అక్కడి నుంచి పరారయ్యారు.
పత్తి కొనుగోళ్లలో మోసాలు
ఎలక్ట్రానిక్ కాంటాలతో మాయాజాలం
క్వింటాకు 20 – 30 కేజీలు కాజేస్తున్న వైనం
నడిగడ్డలో రైతులను
దోపిడీ చేస్తున్న దళారులు


