గద్వాల: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను నూతన విధివిధానాల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నమోదు ప్రక్రియను మూడు విడతల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి జిల్లాలో తొలివిడత నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు ఇంటర్నెట్ సదుపాయం, కంప్యూటర్లు అందుబాటులో ఉండి.. చురుకై న సిబ్బంది ఉన్న గ్రామాలు, మున్సిపల్ వార్డులను ఎంపిక చేయాలని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాల ప్రకారం నమోదు ప్రక్రియను సరళీకృతం చేసినట్లు తెలిపారు. ఇకపై ప్రీ–ఫీల్డ్ దరఖాస్తులు, మాన్యూవల్ ఫారాలు, ప్రింటింగ్ స్కానింగ్ పత్రాల అప్‌లోడ్ అవసరం లేదన్నారు. రేషన్‌కార్డు చివరి ఆరు అంకెలను ఆన్‌లైన్‌లో నమోదుచేస్తే కుటుంబ సభ్యుల వివరాలు ప్రత్యేక్షమవుతాయని.. అందులో బీమా పొందే వ్యక్తి నామినీలను ఎంపిక చేసి, వాటా శాతాన్ని నమోదు చేయాలని సూచించారు. ఇతర బీమా పథకంలో సభ్యత్వం ఉన్న వివరాలను కూడా నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు క్యాంపు ఇన్‌చార్జీలుగా వ్యవహరించాలని.. ఎంపీడీఓలు, తహసీల్దార్లు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి శిబిరానికి బాధ్యులైన సిబ్బంది వివరాలను ముందుగానే నిర్ధారించుకోవాలని.. లాగిన్ ఐడీలు, మొబైల్ నంబర్ల నమోదులో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
● జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలులో వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది కనబర్చిన పనితీరు అభినందనీయమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్ధేశించిన 95–95–95 లక్ష్యాల సాధనలో గణనీయమైన ప్రగతి కనబర్చి జిల్లా సురక్షిత్ కేటగిరీలో గుర్తింపు పొందిన నేపథ్యంలో నాకో డిప్యూటీ డైరెక్టర్ మేఖల, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకో ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సురక్షిత్ కేటగిరీకి ఎంపికై న 20 జిల్లాల్లో జోగుళాంబ గద్వాల చోటు సంపాదించుకోవడం ప్రశంసనీయమన్నారు.


