సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా కల్లు మాఫియా పేట్రేగిపోతోంది. బెల్ట్ షాపుల మాదిరిగా గల్లీగల్లీలో అనధికార కల్లు దుకాణాలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తుండగా.. వాటి కేంద్రంగా మందు కల్లు దందా యథేచ్ఛగా సాగుతోంది. తాటి, ఈత, ఖర్జూర వనాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన కల్లుకు బదులుగా.. నిషేధిత అల్ప్రాజోలం, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్) వంటి ప్రమాదకర మత్తు పదార్థాలను కలిపిన కృత్రిమ కల్లును మాఫియా ఏరులై పారిస్తోంది. కళ్లెదుటే అనుమతుల్లేకుండా వాడవాడలా వెలుస్తున్న దుకాణాలపై ఎకై ్సజ్ శాఖ నామమాత్రపు చర్యలతో సరిపెడుతుండడం విమర్శలకు తావిస్తోంది.
60 శాతం అనధికార దుకాణాలే..
ఆబ్కారీ శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో రిజస్టర్డ్ కల్లు సొసైటీల షాపులు 378, కల్లు డిపోలు 21 ఉండగా.. దీని పరిధిలో 93 దుకాణాలకే కల్లు విక్రయించేందుకు అనుమతులు ఉన్నాయి. ఈ లెక్కన మొత్తం 471 దుకాణాలకు లైసెన్స్ ఉంది. ఈ అధికారిక లైసెన్స్ దుకాణాలకు మించి అనధికారికంగా మరో 600 వరకు దుకాణాలు వెలిసినట్లు తెలుస్తోంది. అంటే ఎలాంటి అనుమతులు లేకుండా 60 శాతానికి పైగా కల్లు దుకాణాలు వార్డులు, డివిజన్లు, గ్రామాల వారీగా విస్తరించాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐదారేళ్లలో రూ.5 కోట్ల వ్యయంతో ఏడెనిమిది లక్షల మేర తాటి, ఈత మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నా.. ఆ సంఖ్య వేల లోపే ఉంది. మొత్తంగా 75 శాతానికి పైగా మందు కల్లు విక్రయాలే జరుగుతున్నాయి.
ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..
కాలనీ మధ్యలో కల్లు దుకాణంతో నిత్యం ఏదో గొడవ జరుగుతోంది. తాగేందుకు వచ్చేవారు గంటల తరబడి ఉంటున్నారు. ఖాళీ సీసాలను ఇంటి ముందు పడేస్తున్నారు. ఇళ్ల గేట్ల ముందే మూత్ర విసర్జన చేస్తున్నారు. మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ దుకాణాన్ని తొలగించాలని గతంలో కలెక్టర్, ఎకై ్సజ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినం. ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు.
– శాంతమ్మ, గృహిణి,
పాత పాలమూరు, మహబూబ్నగర్
ఉమ్మడి జిల్లాలో జోరుగా మందు కల్లు దందా
బెల్ట్ షాపుల మాదిరిగా విస్తరిస్తున్న అనధికార దుకాణాలు
జనావాసాల మధ్యే ఏర్పాటు.. స్థానికుల్లో నిత్యం ఆందోళన
అడ్డంకులు రాకుండా పలు శాఖలకు ఆమ్యామ్యాలతో ముకుతాడు
ఎకై ్సజ్ అధికారుల తూతూమంత్రపు చర్యలపై విమర్శలు


