● మార్మోగిన గోవింద నామస్మరణ
● వైభవంగా కొనసాగుతున్న వేంకటేశ్వరస్వామి జాతర
భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో వెలసిన పాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం స్వామివారు హంస వాహన రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేసి.. రథోత్సవాన్ని లాగారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రథాన్ని ఆలయం నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. అలాగే స్వామివారిని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అలాగే రాష్ట్ర షీప్ అండ్ గోట్ చైర్‌పర్సన్ సరిత, తెలంగాణ రక్షణ సేన సమితి రాష్ట్ర నాయకుడు బుచ్చిబాబు స్వామివార్లను వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
జాతరకు పటిష్ట భద్రత
పాగుంట జాతరలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పార్కింగ్ ప్రదేశాల వద్ద ట్రాఫిక్ జాం కాకుండా చూసుకోవాలని చెప్పారు. రాత్రి సమయంలో చోరీలు జరగకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎస్పీ వెంట సీఐ శ్రీను, ఎస్‌ఐలు శ్రీనివాసులు, శ్రీకాంత్, శ్రీహరి, తారక తదితరులున్నారు.


