శుభ్రత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

శుభ్రత తప్పనిసరి

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

అలంపూర్‌: మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు పరిశుభ్రంగా ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్‌ అన్నారు. శుక్రవారం అలంపూర్‌ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, బీసీ వసతిగృహంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వంట గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల, వసతిగృహంలోని వ్యర్థాలను మున్సిపాలిటీ వాహనంలో వేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం బేకరీలను తనిఖీ చేశారు. బేకరీలో శుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనర్‌ వెంట మున్సిపల్‌ మేనేజర్‌ వెంకటయ్య, వార్డు ఆఫీసర్‌ ఈశ్వరయ్య, సిబ్బంది రమేశ్‌, లక్ష్మీనారయణ, హరిప్రసాద్‌ ఉన్నారు.

ఓటరు నమోదు

వేగవంతం చేయాలి

కేటీదొడ్డి: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శుక్రవారం కేటీదొడ్డిలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీపాదరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించడంలో పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌, ఎక్బోటే, హన్మిరెడ్డి, ఎర్ర భీంరెడ్డి, దేవేందర్‌రెడ్డి ఉన్నారు.

కూలీల సంఖ్య పెంచండి

అయిజ: వీబీ–జీ రామ్‌జీ పథకం ద్వారా చేపడుతున్న ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని డీపీఓ శ్రీకాంత్‌ అన్నారు. శుక్రవారం అయిజ మండలం వెంకటాపురం గ్రామ శివారులో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జలసిరి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పొలాల్లో నీటి కుంటలు, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ పనులను వేగవంతంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎంపీఓ మనోహర్‌, పంచాయతీ కార్యదర్శి స్వాతి ఉన్నారు.

పల్లీ క్వింటా రూ.8,444

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శుక్రవారం 329 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,444, కనిష్టంగా రూ. 4,850, సరాసరి రూ. 8,444 ధరలు లభించాయి. అలాగే 15 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాకు గరిష్టంగా రూ. 7,972, కనిష్టంగా రూ. 7,790, సరాసరి రూ. 7,960 ధరలు పలికాయి. 34 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాకు గరిష్టంగా రూ. 3,452, కనిష్టంగా రూ. 3,271 ధరలు వచ్చాయి.

నేడు జూరాల కాల్వలకు నీటి విడుదల

అమరచింత: జూరాల కాల్వలకు శనివారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు సీఈ రహిమొద్దీన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి నవంబర్‌ 4 వరకు ప్రధాన ఎడమ, కుడి కాల్వలకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. జలాశయానికి ఎగువ నుంచి వరద భారీగా రాకపోవడంతో వానాకాలంలో ఆయకట్టు కింద సాగుచేసిన వరి పంటలకు చివరితడిగా నీటిని అందించేందుకు ప్రభుత్వం ఆదేశించినట్లు వివరించారు. భవిష్యత్‌ తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రాజెక్టులోని నీటిని పొదుపుగా వినియోగిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement