గద్వాల క్రైం: ప్రతి విద్యార్థి ధైర్యంగా లైంగిక వేధింపులను కట్టడి చేయాలని పోక్సో, సెషన్ కోర్టు న్యాయమూర్తి వి.శ్రీనివాస్ అన్నారు. సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలలపై లైంగిక నేరాలు, చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు బాలల హక్కులు, సైబర్ నేరాలు, భద్రత అంశాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థి దశలోనే సమాజంలో జరుగుతున్న వికృత చేష్టలు, సమస్యలను గుర్తించాలని సూచించారు. బాలికలతో ఎవరైనా అనుచితంగా వ్యవహరించినా, వేధింపులకు పాల్పడినా ఎలాంటి భయాందోళన లేకుండా తల్లిదండ్రులకు తెలియజేయాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దన్నారు. అపరిచితుల మాటలను నమ్మి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్‌జడ్జి నిష్కా పాత్రుడు, డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, ఉపాధ్యాయుడు బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.


