సురక్షిత్‌ ప్లస్‌ హోదా దిశగా ముందుకు | - | Sakshi
Sakshi News home page

సురక్షిత్‌ ప్లస్‌ హోదా దిశగా ముందుకు

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

గద్వాల: జిల్లాను సురక్షిత్‌ ప్లస్‌ హోదా దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. మొబిలైజేషన్‌ ఫర్‌ ఎయిడ్స్‌ సురక్ష కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని శుక్రవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా సాధించిన సురక్షిత్‌ హోదా ముఖ్యమైన విజయమని, ఈ గుర్తింపుతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇప్పటి వరకు సాధించిన ప్రగతితో సంతృప్తి చెందకుండా, ఇదే స్ఫూర్తి అంకితాభావంతో ముందుకు సాగాలన్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా మొబిలైజేషన్‌ కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలు, ఐసీటీసీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయడం ద్వారానే ఆశించిన ఫలితాలను సాధించగలమన్నారు. ప్రతి ఒక్కరు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, అవసరమైన సేవలు అందించాలని తెలిపారు. అనంతరం జిల్లాను సురక్షిత్‌ ప్లస్‌ హోదా దిశగా తీసుకెళ్లేందుకు కృషిచేసిన అధికారులు, సిబ్బందికి జ్ఞాపికలతో ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.సంధ్య, ప్రోగ్రాం ఽఅధికారి డా.రాజు, రమేశ్‌, రవీందర్‌రెడ్డి, సాయికుమార్‌ పాల్గొన్నారు.

● విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. గద్వాల మండలం వీరాపురం సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఇటీవల నిర్వహించిన పరీక్షల ఫలితాలపై ఆరా తీశారు. విద్యార్థులు వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏరంగంలో రాణించాలన్నా నైపుణ్యాలు అవసరమని.. అందుకు అనుగుణంగా విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్‌, బెట్టింగ్‌ తదితర వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడే వయసులో వ్యసనాల బారిన పడితే భవిష్యత్‌ నాశనమవుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement