వనపర్తి: జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడటం లేదు. అక్రమార్కులు పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రైవేట్ అవసరాలు, వెంచర్లు, ఇతర నిర్మాణాలకు ఇష్టానుసారంగా గుట్టలను తవ్వి మట్టి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫిర్యాదు చేసేందుకు, ప్రశ్నించేందుకు యత్నించిన వారిపై ఎదురుదాడికి తెగబడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇటీవలి కాలం వరకు పట్టణంలోని శ్రీనివాసపురం శివారు, పాన్‌గల్ రోడ్డులోని గుట్టల్లో తవ్వకాలు జరిగాయి. తాజాగా పది రోజుల నుంచి రాజపేట శివారులో ఎలాంటి అనుమతి లేకుండానే గుట్టలను తవ్వేసి మట్టిని కొత్తకోట శివారులోని ఓ ప్రైవేట్ స్థలానికి తరలిస్తూ సొమ్ము చేసుకోవడం అధికారుల కంట పడినా.. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే స్పందించేలా ప్రవర్తించడం గమనార్హం. అనుమతులు, నిబంధనల పర్యవేక్షణ మాట ఎలా ఉన్నా.. మట్టి తవ్వకాలు, తరలింపుపై అధికారుల నిఘా ఎక్కడుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ.లక్షల్లో అక్రమార్జన జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ.లక్షల్లో దందా..
మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా వెనుక భారీగా అక్రమార్జన జరుగుతోందన్నది వాస్తవ విషయం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి విషయా న్ని పక్కన పెట్టి తవ్వకాలు చేపడితే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోయే అవకాశం ఉందనే విషయం తెలిసినా.. అధికారులు నిమ్మకుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతించినా పరిమాణానికి మించి తవ్వకాలు చేపడుతూ.. రా యల్టీ చెల్లింపుల్లోనూ కోతపెడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఈ వ్యవహారంలో వాస్తవంగా ఎంత మేర తవ్వకాలు జరిగాయి? ఎంత న ష్టం వాటిల్లింది? అనే అంశాలపై అధికారులు సమ గ్ర విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మైనింగ్‌శాఖ నిఘా ఏమైంది?
మట్టి తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరు నిర్వహిస్తున్నారు? ఎలాంటి అనుమతులు ఉన్నాయి? నిబంధనల ప్రకారం తవ్వకాలు సాగుతున్నాయా? అనే అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన మైనింగ్‌శాఖ అధికారులు కనీసం పట్టింపులేనట్లు వ్యవహరించటం గమనార్హం.
సరిపడా సిబ్బంది లేకనే..
పదోన్నతిపై వరంగల్‌లో విధులు నిర్వర్తిస్తున్నా. జి ల్లాలో పర్యవేక్షణ ఇబ్బంది అవుతుంది. ఇక్కడి కా ర్యాలయం టైపిస్టు, అటెండర్‌తో మాత్రమే నడుస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటించే సిబ్బంది ఎవరూ లేరు. అందరు అధికారులు ఉంటేనే అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయగలం. సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – గోవిందరాజు,
జిల్లా మైనింగ్‌శాఖ అధికారి
శ్రీనివాసపురం, రాజపేట శివారుల్లో జోరుగా అక్రమ తవ్వకాలు
రూ.లక్షల్లో అక్రమార్జన.. ప్రభుత్వ ఖజానాకు గండి
మైనింగ్‌శాఖ పర్యవేక్షణపై అనుమానాలు
ఏళ్లుగా ఇన్చార్జి అధికారితోనే నెట్టుకొస్తున్న వైనం


