మానవపాడు: అలంపూర్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ రాజుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మానవపాడు మండలంలో కలుకుంట్ల నుంచి అమరవాయి మీదుగా జాతీయ రహదారి–44 వరకు దాదాపు రూ.3.33 కోట్లతో రోడ్డు పనులు చేపట్టగా.. ఇప్పటి వరకు పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయని రాష్ట్ర రోడ్డు అథారిటీ మెంబర్ సతీష్‌రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఓటును ఏ విధంగా అడగాలని ఆయన ప్రశ్నించారు. మంగళవారం మండలంలోని కలుకుంట్లలో రోడ్డు నిర్మాణ శిలాఫలకం ముందు మాట్లాడారు. అప్పట్లో హడావుడి చేసి మంత్రులు రాకముందే శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయుడు ఇప్పుడు ఈ రోడ్డు గురించి మాట్లాడకపోవడంపై మండిపడ్డారు. కనీసం తన సొంత గ్రామానికై నా జాతీయ రహదారి నుంచి పుల్లూరు, కలుగోట్ల గ్రామాలకు రోడ్డు కూడా వేయించుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మారిపోయిన.. అధికారంలో ఉన్నా తామే ప్రజల కోసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామని చెప్పారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తక్షణమే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తేజేశ్వర్‌గౌడ్, సిరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


