గద్వాల: ఎల్‌నినో కారణంగా జిల్లావ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతుల సమస్యలు, బాగోగులపై ఈ నెల 12న సీఎం రేవంత్‌రెడ్డి వీసీ ద్వారా ముఖాముఖి నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రైతువేదికలతో పాటు వీడియో కాన్ఫరెన్స్ సెట్‌లు ఉన్న చోట రైతులు సీఎం ప్రసంగాన్ని వినేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రేపు రాష్ట్రస్థాయి
హాకీ టోర్నీ
అలంపూర్: పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాల మైదానంలో ఈ నెల 12 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట శ్రీనివాసులు తెలిపారు. శనివారం కర్నూలులో స్థానిక ఎమ్మెల్యే విజయుడిని ఆయన కలిసి టోర్నీకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టోర్నీ ఏర్పాట్లను ఆయనకు వివరించారు. ఎస్‌జీఎఫ్ అండర్–17 రాష్ట్రస్థాయి హోకీ టోర్నమెంట్‌కు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు హాజరవుతారని తెలిపారు. ఆయన వెంట పీడీ భరత్‌కుమార్ ఉన్నారు.
న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె
గద్వాల క్రైం: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు. శనివారం జిల్లా ఆస్పత్రి ఆవరణలో సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టైఫండ్ 30 శాతం పెంచాలని, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంచొద్దని, పోస్టుల భర్తీలో ఎండీలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చాందిని, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.


