గద్వాల న్యూటౌన్: త్వరలో జరగబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుపు కోసం అంకితభావంతో పనిచేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం స్థానిక డీకే బంగాల్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం విద్యావంతుల్లో బీజేపీకి బలమైన మద్దతు ఉందన్నారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ పూర్తి ఐక్యతతో, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటుందని చెప్పారు. పార్టీ ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించినా శ్రేణులన్నీ ఏకతాటిపై నిలిచి గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలని సూచించారు. రెండు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్న పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, రామచంద్రారెడ్డి, బాపురెడ్డి, రవికుమార్, శ్యాంరావు, శివారెడ్డి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


