అలంపూర్: జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని మార్పు చేశారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించి మున్సిపల్ అధికారులు మరో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలంపూర్ మున్సిపాలిటీలో మహాత్ముడి విగ్రహ ఏర్పాటులో మూడు రోజులుగా ఆందోళన నెలకొన్నాయి. మున్సిపాలిటీలోని గాంధీచౌక్‌లో ఉన్న విగ్రహం వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో ఇటీవలే తొలగించారు. దాతల సహకారంతో డివైడర్‌లో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే పాత విగ్రహం ధ్వంసమైన స్థితిలో ఉండటంతో.. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల నాయకులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ ఆపాలని ఆందోళన చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బుధవారం అర్ధరాత్రి తొలగించి.. ఆ విగ్రహాన్ని మరో చోటికి తరలించి భద్రపర్చినట్లు సమాచారం. మున్సిపల్ అధికారులు మరో కొత్త విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. పాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై మున్సిపల్ కమిషనర్ రాజేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని రామకృష్ణ తెలిపారు.


