గద్వాల/అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఆయకట్టుకు గురువారం నుంచి వారాబందీ విధానంలో సాగునీరు సరఫరా చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు అధికారికంగా వెల్లడించారు. కుడి, ఎడమ కాల్వలకు వరుసగా ఐదురోజులపాటు సాగునీరు సరఫరా చేస్తూ.. మరో 5 రోజులపాటు నిరంతరాయంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. మొదటిసారిగా వానాకాలంలో వారాబందీ విధానంలో సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో కుడి, ఎడమ కాల్వల కింద 1.15 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవక జలాశయానికి ఆశించిన మేర వరద చేరలేదు. దీంతో ఆయకట్టులో వరి సాగుచేస్తే నీరు ఇవ్వలేమని.. కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని ఇరిగేషన్ అధికారులు ముందునుంచే గ్రామాల్లో టాంటాం వేయించారు. అయినా ఆయకట్టు రైతులు మా త్రం కాల్వల్లో సాగునీరు పారుతుండటంతో వరి సాగు చేశారు. ప్రస్తుతం జలాశయంలో 5.908 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో వచ్చే రెండునెలలపాటు వారాబందీ విధానంలో నీటి సరఫరాకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఎప్పుడెప్పు డు సాగునీరు అందిస్తామనే వివరాలను ఆయకట్టు గ్రామాల్లో రైతులకు వివరించాలని కాల్వ వెంట విధులు నిర్వహిస్తున్న లష్కర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏఈలు, డీఈలు సైతం వారాబందీపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గురువారం వెలువడిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నేటి నుంచి నిలిపివేత..
వారాబందీ విధానం అమలులోకి రావడంతో జూరాల కుడి, ఎడమ కాల్వలకు శుక్రవారం నుంచి సాగునీటి సరఫరాను నిలిపివేయనున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టుపై ఆధారపడిన నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, విద్యుదుత్పత్తి కేంద్రాలకు గురువారం సాయంత్రమే నీటి సరఫరా నిలిపివేశారు. వీటితోపాటు సమాంతర కాల్వలో సైతం లీకేజీ నీరు పారకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
జలాశయానికి నిలిచిన వరద..
జూరాల ఆయకట్టులో పంటలు ఎండుతున్నాయని.. ఆల్మటి నుంచి నీటిని వదలాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు జూరాల జలాశయానికి 10 పర్యాయాలు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఎగువనున్న నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు నీరు పారుతుండటంతో గత నెల 26న జూరాల కాల్వలతోపాటు ఎత్తిపోతల పథకాలకు నీటిని వదిలారు. ప్రస్తుతం ఎగువ నుంచి వరద నిలిచిపోవడంతో కాల్వలు, ఎత్తిపోతలకు వారాబందీ ప్రకటించారు.
తిరిగి ఈ నెల 7న విడుదల..
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కృష్ణానదిలో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని జూరాల కింద సాగుచేసిన ఆయకట్టుకు వారాబందీ విధానంలో సాగునీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల డ్యాం డీఈ నాగేశ్వర్‌రావు తెలిపారు. అందులో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటలకు కాల్వ కు నీటి విడుదల నిలిపివేశామని, తిరిగి ఈ నెల 7న కాల్వకు నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని రైతులు గమనించి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
అధికారికంగా ప్రకటించిన అధికారులు
గురువారం నుంచే అమలులోకి..
5 రోజులపాటు సాగునీటి సరఫరా.. మరో 5 రోజులు నిలిపివేత
జలాశయంపై ఆధారపడిన ఎత్తిపోతలకు వర్తింపు


