గద్వాల: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై విస్తృతంగా ప్రచారం చేస్తూ.. అర్హులైన ప్రతిఒక్కరు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. జిల్లాలోని డిగ్రీ కళాశాలలు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సర్ ప్రక్రియలో భాగంగా 1,49,282 నోటీసులు జారీచేసి.. ఇప్పటి వరకు 1,32,459 విచారణలు పూర్తిచేశామని, పెండింగ్‌లో ఉన్నవాటిని త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అర్హతకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో ఎలాంటి తప్పులు లేకుండా అప్‌లోడ్ చేయాలన్నారు. అనర్హులు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారు, మరణించిన ఓటర్లను నిబంధనల మేరకు పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ మంజుల తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను నెలవారి సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
పక్కాగా ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
జిల్లాలో ఈ నెల 11 నుంచి 17 వరకు ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ అన్నారు. టాస్ ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో వెబ్‌ఎక్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఉయదం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పదో తరగతి, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు. పదో తరగతిలో 43 మంది, ఇంటర్‌లో 176 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ నెల 23 నుంచి 30 వరకు నిర్వహించే ప్రాక్టికల్స్‌ను గద్వాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


