జీవాలకు బీమా.. ధీమా! | - | Sakshi
Sakshi News home page

జీవాలకు బీమా.. ధీమా!

Oct 2 2026 12:40 AM | Updated on Oct 2 2026 12:40 AM

గద్వాల వ్యవసాయం: జీవాల (గొర్రెలు, మేకలు)కు బీమా పథకానికి ప్రభుత్వం ఇటీవలే శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగే ఈ పథకానికి గాను రాష్ట్రంలో జోగుళాంబ గద్వాల జిల్లాను పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసి అమలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 6,96,296 జీవాలు ఉండగా.. బీమా పథకం అమలు చేయడం వల్ల వాటి పెంపకందారులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

రూ.3–8 వేల వరకు..

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత వ్యవసాయ బీమా కంపెనీ (అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా, ఏఐసీ) ద్వారా జీవాలకు బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు ఇన్సూరెన్స్‌ క్‌లైయిం అయ్యేలా పథకాన్ని రూపొందించారు. ప్రీమియంలో 50 శాతం శాతం డబ్బును కేంద్రం, 35 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాయి. మిగలిన 15 శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. బీమా 6 నెలల నుంచి 4 ఏళ్ల వయస్సు ఉన్న గొర్రెలు, మేకలు, పొట్టేళ్లకు చేయించవచ్చు. ఒక్కో పెంపకందారుడు సగటున 100 జీవాల వరకు బీమా చేయించడానికి అవకాశం కల్పించారు. ప్రీమియం రేటు 2.95 శాతంగా ఉంటుంది. బీమా చేసే జీవాలకు పశువైద్యాధికారులు వాటి చెవులకు ట్యాగ్‌లు వేసి.. వాటి ఫొటోలు, పెంపంకదారుని ఫొటో, వివరాలు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

అనారోగ్య కారణాలతో..

జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకం, విక్రయంపై ఆధారపడి జీవన సాగిస్తున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. సొసైటీలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాలు, అవకాశాలను ఇక్కడి పెంపకందారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే పలు సందర్భాల్లో జీవాలు ప్రమాదవశాత్తు, అనారోగ్య కారణాలతో మృతిచెందుతూ పెంపకందారులు ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బీమా లేకపోవడమే. 2005 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో గొర్రెల బీమా పథకం అమలులో ఉండేది. రూ.వెయ్యి వచ్చే బీమాకు వాటాదారుడు రూ.9 చెల్లించేవారు. ఆ తర్వాత జీవాలకు ఎలాంటి బీమా సౌకర్యం లేకుండాపోయింది. 2017లో తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా పంపిణీ జరిగినప్పుడు ఏడాదికి వర్తించేలా బీమా సౌకర్యం కల్పించారు. అయితే గొర్రెలు తీసుకున్న పెంపకందారులు ఆ ఏడాదికి మాత్రమే బీమా ప్రీమియం చెల్లించడంతో ఈ పథకం కూడా 2019 వరకు మాత్రమే అమలైంది. ఈ మధ్యకాలంలో జిల్లాలో ప్రమాదాలు, అనారోగ్యాలతో సుమారు 8 వేల వరకు జీవాలు మృతిచెందగా.. ఒక్కో జీవంపై పెంపకందారులు రూ.3 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయారు.

పైలెట్‌ ప్రాజెక్ట్‌గా జోగుళాంబ గద్వాల జిల్లా ఎంపిక

ఒక్కో పెంపకందారు సగటున 100 జీవాలకు అవకాశం

కేంద్రం 50, రాష్ట్రం 35 శాతం ప్రీమియం చెల్లింపు

మిగిలిన 15 శాతం లబ్ధిదారుని వాటా

జిల్లాలో 6,96,296 జీవాలకు మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement