గద్వాల న్యూటౌన్: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని ప్రిన్సిపాల్ షేక్ కలందర్‌బాష అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో లైఫ్‌సైన్స్ తృతీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగత వేడుకలు (ఫ్రెషర్స్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిగ్రీ స్థాయి అనేది విద్యార్థుల జీవితంలో కీలకమైన ఘట్టం అన్నారు. ఈ సమయాన్ని వృథా చేయకుండా, లైబ్రరీ, కళాశాలలోని వనరులను, అధ్యాపకుల అనుభవాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్యతోపాటు సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థులు పరిశోధనాత్మక ఆలోచన ధోరణిని పెంపొందించుకోవాలన్నారు. కళాశాలలో లభించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ విద్యార్థులు తమలోని నైపుణ్యాలను వెలికితీసి.. కళాశాల, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ చంద్రమోహన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాధిక, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ సురేందర్‌రెడ్డి, కరుణాకర్, వెంకటేశ్వరమ్మ, హరినాథ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


