గద్వాల: శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో ప్రధానపాత్ర పోషించిన గాంధీజీ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతిపిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస, సత్యం, శాంతి సందేశాలతో గాంధీజీ చూపిన మార్గం అనుసరణీయమన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి అనేక ఉద్యమాలతో దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ప్రజలందరినీ ఏకం చేసిన గాంధీజీతోపాటు ఎంతోమంది త్యాగఫలాలతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని కొనియాడారు.
● మహాత్మాగాంధీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. చింతలపేటలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆదర్శంగా తీసుకోవాలి
గద్వాల క్రైం: జాతిపిత మహాత్మాగాంధీ, రెండో ప్రధాని లాల్ బహదూర్‌శాస్త్రి జయంతులను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో అహింస, సత్యం తన సిద్ధాంతం అని బ్రిటీష్ ప్రభుత్వానికి చాటి చెప్పారన్నారు. ఆయన స్ఫూర్తి నేటికి ఆచరణలో ఉందన్నారు. భారత ప్రధానిగా లాల్ బహదూర్‌శాస్త్రి ఎన్నో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. జై జెవాన్.. జై కిసాన్ అనే నినాదంతో ప్రతిఒక్కరి అభిమతాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారన్నారు. ఇద్దరి జీవితాల్లో ఎన్నో అధ్యయనాలకు చిరునామాగా ఉన్నా రని కొనియాడారు. ప్రతిఒక్కరూ జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.


