జిల్లాలో స్టెరాయిడ్‌ల వాడకం విచ్చలవిడిగా మారింది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న కేటీదొడ్డి, ధరూరు, గట్టు, అయిజ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో యువత వైద్యుల సిఫార్సు లేకుండానే స్టెరాయిడ్స్ వాడుతున్నారు. చేతిరాళ్ల పోటీల్లో పాల్గొనే యువకులు ఎక్కువగా స్టెరాయిడ్స్‌కు బానిసగా మారుతున్నారు. స్టెరాయిడ్‌ను ఎక్కించుకుని అవలీలగా బరువులను ఎత్తుతుంటారు. మరికొందరు వీటి కారణంగా కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డోస్ ఎక్కువై ప్రాణాలను పోగొట్టుకున్న సంఘటనలు లేకపోలేదు.
నేరుగా ఇంటి వద్దకే..
కర్ణాటక నుంచి ఆన్‌లైన్ ద్వారా స్టెరాయిడ్స్‌ను నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉర్సులు, జాతర్లు, ఊర దేవర్లు, ఇతర పండుగల సందర్భంలో నిర్వహించే చేతిరాళ్ల పోటీల్లో పాల్గొనే యువకులు స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో చేతిరాళ్లు ఎత్తే సాధన సందర్భంగా కొందరు యువకులు స్టెరాయిడ్స్‌ను శరీరానికి ఎక్కించుకొని.. ఆ మత్తు దిగే దాకా చేతిరాళ్లతో పోటీ పడుతుంటారు. ఎంతటి బరువునైనా అవలీలగా ఎత్తేస్తుంటారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చే వాటిపై పెద్దగా నిఘా లేకపోవడంతో గ్రామాల్లోని యువత స్టెరాయిడ్స్ తెప్పించుకుని, సిరంజీల ద్వారా శరీరంలోకి ఎక్కించుకుంటున్నారు. ఆ తర్వాత సిరంజీలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. ఇటీవల యల్లందొడ్డి గ్రామంలో స్టెరాయిడ్స్‌ను ఉపయోగించుకున్న తర్వాత సిరంజీలను పాఠశాల పరిసరాల్లో పడేయడంతో విద్యార్థులు, గ్రామస్తుల కాళ్లకు గుచ్చుకున్న సంఘటనలు వెలుగుచూశాయి.
అవగాహన
లేకపోవడంతో..
ఎంతో మంది యువకులు క్రమంగా మత్తుకు బానిసగా మారుతూ.. రోగాల బారిన పడుతున్నారు. స్టెరాయిడ్స్ వాడడం వలన కలిగే అనర్థాలపై గ్రామీణ ప్రాంతాల వారికి అవగాహన లేకపోవడంతో వీటిని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు, పోలీసులు సంయుక్తంగా స్టెరాయిడ్స్ వాడకం వలన కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదిలాగే కొనసాగితే పరిస్థితి మరోలా మారే ప్రమాదం లేకపోలేదని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అవగాహన కల్పిస్తాం..
ఏ మందులు వాడాల్సి వచ్చినా వైద్యుల సూచన మేరకే ఉండాలి. ఇష్టం వచ్చినట్లు మందులు వాడితే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు బల ప్రదర్శనకు ముందు స్టెరాయిడ్స్ వాడడం వలన తాత్కాలికంగా వారిలో ఉత్తేజం కలిగినా.. దీర్ఘకాలింగా శరీర ప్రధాన అవయవాలు (కాళ్లు, చేతులు) పని చేయకుండా పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. వీటిని వాడకుండా వైద్య బృందం చేత గ్రామాల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. మెడికల్ దుకాణాలు, గ్రామీణ వైద్యశాలలు నిర్వహించే చోట తనిఖీలు చేపడుతాం. అక్రమంగా స్టెరాయిడ్స్ నిల్వ చేసినా.. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటాం.
– సంధ్యాకిరణ్మయి, డీఎంహెచ్‌ఓ
విచారణ జరుపుతున్నాం..
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో స్టెరాయిడ్స్ వాడకం యువతకు అలవాటుగా మారింది. దీనిపై ఇప్పటికే పోలీసులు దృష్టిసారించారు. స్టెరాయిడ్స్ ఎక్కడ నుంచి సరఫరా చేస్తున్నారనే దానిపై నిఘా పెట్టి విచారణ జరుపుతున్నాం. యల్లందొడ్డి గ్రామ పాఠశాల ఆవరణలో స్టెరాయిడ్స్ వాడి పారేసిన సిరంజీల విషయం మా దృష్టికి రావడంతో గ్రామానికి వెళ్లి యువకులకు అవగాహన కల్పించాం. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిపై కఠినంగానే వ్యవహరిస్తాం. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీస్ కళా బృందం చేత గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– మొగులయ్య, డీఎస్పీ, గద్వాల
జిల్లాలో విచ్చలవిడిగాస్టెరాయిడ్ల వాడకం
కర్ణాటక నుంచి ఆన్‌లైన్‌లో దిగుమతి
సరిహద్దు గ్రామాల్లో
మరింత ఎక్కువగా వినియోగం
ఎక్కడ పడితే అక్కడ నీడిల్, సిరంజీలు పారబోత
ఆదిలోనే అరికట్టకపోతే
భవిష్యత్‌లో పెను విపత్తు


