గద్వాల: ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించి.. అనేక పథకాలు అమలు చేస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధులు ఆరోగ్య సంరక్షణ కోసం నిత్యం యోగా, నడకకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. అలాగే పుస్తకాలు చదవడం, కుటుంబంతో సంతోషంగా గడపడం ద్వారా జీవిత చరమాంకాన్ని ఆనందంగా గడపవచ్చన్నారు. అనంతరం చేపట్టిన ర్యాలీని జిల్లా సంక్షేమ అధికారి సునందతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
అంతర్జాతీయస్థాయిలో రాణించాలి..
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్ధాయిలో రాణిస్తారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు జిల్లాస్ధాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించే దివ్యాంగులు పారాలింపిక్స్ వరకు వెళ్లి పతకాలు సాధించే అవకాశం ఉందన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్ధులందరికీ పార్టీసిపేషన్ సర్టిఫికెట్ అందజేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం స్టేడియంలో చేపట్టిన సింథటిక్ మ్యాట్, పెయింటింగ్స్ పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమాల్లో డీఈఓ విజయలక్ష్మి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ అయ్యప్పరెడ్డి పాల్గొన్నారు.


