గద్వాల న్యూటౌన్: క్రీడల్లో గెలుపోటమలు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని జిల్లా హకీ అసోసియేషన్ అధ్యక్షుడు త్యాగరాజు అన్నారు. స్థానిక నల్ల సోమనాద్రి స్టేడియంలో బుధవారం ఎస్‌జీఎఫ్‌ఏ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ –17 హకీ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. టోర్నీలో గద్వాల జిల్లాతో పాటు వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు పాల్లొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయయన మాట్లాడారు. ఓటమిని నిరుత్సాహంగా భావించకుండా, మరింత పట్టుదలతో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. ప్రతిభ కల్గిన క్రీడాకారులను గుర్తించి, వారి భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా నిష్పక్షపాతంగా ఎంపికలు చేపట్టాలని సెలక్షన్ కమీటీకి సూచించారు. క్రీడాకారులు ఆటపై పూర్తి శ్రద్ధ పెట్టడంతో పాటు క్రమశిక్షణ పాటించాలన్నారు. గాయాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ టోర్నీ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి భవిష్యత్‌లో ఉన్నత స్థాయి పోటీల్లో అవకాశాలు కల్పించేందుకు నిర్వాహకులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ ఆనంద్‌కుమార్, పీడీ నాగేష్ పాల్గొన్నారు.


