అందినంత దోచుకో..! | - | Sakshi
Sakshi News home page

అందినంత దోచుకో..!

Sep 30 2026 12:52 AM | Updated on Sep 30 2026 12:52 AM

అధికారం మనదే..
బీసీ రాజ్యాధికారాన్ని సాధించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు.

వాతావరణం

ఉదయం ఆకాశం మేఘావృత్తమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది.

–8లో u

గద్వాల: గద్వాల మున్సిపాలిటీ అంటేనే ఆది నుంచి అక్రమాలకు నెలవు. ఇక్కడ అధికారం ఉన్నోడిదే రాజ్యం. వారు చెప్పిందే శాసనం. ఇదే అదునుగా కొందరు అధికారులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న తరహాలో సాగుతుంది. ఈ క్రమంలోనే కొందరు అధికారులు, సిబ్బంది అవినీతిని ఒంటబట్టించుకుని వసూళ్లకు తెగబడుతున్నారు. సాధారణంగా మున్సిపాలిటీలకు షాపుల అద్దె, పన్నులు (ఇంటి, నీటి) వంటివి ప్రధాన ఆదాయవనరు. వీటిని వసూలు చేసే రెవెన్యూ సెక్షన్‌లో కీలకంగా పనిచేస్తున్న ఓ అధికారి లంచావతారం ఎత్తాడు. ఏకంగా ఓ ఇంటికి నంబర్‌ కేటాయించడానికి రూ.3 లక్షలు వసూలు చేశాడంటే సదరు అధికారి వసూళ్ల తీవ్రతను స్పష్టం చేస్తుంది. సందులో సడేమియా అన్నతరహాలో కిందిస్థాయి ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సైతం దోచేస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇలా అప్పనంగా వచ్చిన డబ్బుతో బెట్టింగ్‌లు, పేకాట వంటి జల్సాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెవెన్యూ వసూళ్లలో రూ.11.50 లక్షలు దోచేశారని బయటకు పొక్కడం, ఇందులో అసలు దోషులు పక్కకు తప్పుకుని కిందిస్థాయి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని బలి చేశారనే ప్రచారం వినిపిస్తుంది. ఇదిలా ఉండగానే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగి తాను సొంతానికి వాడుకున్న రూ.10 లక్షలు గుట్టుచప్పుడు కాకుండా రెండు రోజుల కిందట మున్సిపల్‌ ఖాతాలో జమచేయగా, మరో ఉద్యోగి తాను వాడుకున్న డబ్బులో తనకున్న సొంత ద్విచక్రవాహనాన్ని విక్రయించి రూ.50 వేలు జమ చేసి నట్లు తెలిసింది. ఈ క్రమంలో గద్వాల మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు అటు ఉన్నతాధికారులకు కనిపించడం లేదా.. కనిపిస్తే ఎవరికి బెదిరిపోయి మౌనంగా ఉంటున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.

అక్రమాలకు పుట్ట రెవెన్యూ సెక్షన్‌..

గద్వాల మున్సిపాలిటీకి నెలకు రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. ఇది గ్రహించిన రెవెన్యూ సెక్షన్‌లో కీలక అధికారి తనకున్న రాజకీయ పలుకుబడితో చక్రం తిప్పి గత కౌన్సిల్‌లో అయిజ నుంచి గద్వాలకు బదిలీపై వచ్చాడు. అప్పటి నుంచి రోజువారిగా టార్గెట్‌ పెట్టుకుని మరీ ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేసి వసూళ్లకు తెగబడుతున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఓ ఇంటికి నంబర్‌ కేటాయింపులో రూ.3 లక్షలు వసూలు చేసినట్లు తెలుసుకున్న మున్సిపల్‌ ముఖ్య నేత భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదని బదిలీ చేసుకుని వెళ్లాలని హెచ్చరించినట్లు సమాచారం. దీనికి ఇటీవల మున్సిపాలిటీకి పన్నుల రూపంలో వచ్చే డబ్బులలో రూ.11 లక్షలు పక్కదారి పట్టినట్లు వెలుగుచూసిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వాస్తవానికి పన్నులు వసూలు చేసేందుకు రెండు విధానాలు పాటిస్తుంటారు. పన్నులు వసూలు చేసేందుకు మిషన్లు, రసీదు పుస్తకాలను వినియోగిస్తుంటారు. రోజువారిగా వసూలు చేసిన పన్ను డబ్బులను ఏరోజుకారోజు మున్సిపల్‌ సాధారణ ఖాతాలో జమచేయాలి. మిషన్లు, రసీదుల ద్వారా వచ్చినది ఆర్‌ఐ, ఆర్‌వో చెక్‌ చేయాలి. వచ్చిన డబ్బులను చిట్టాపద్దులు చూసే అధికారికి అప్పగించాలి. ఆ అధికారి అదేరోజు లేదా మర్చంట్‌ రోజు బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిరోజు మున్సిపల్‌ కమిషనర్‌ పర్యవేక్షించాలి. అయితే ఇక్కడ దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. పన్ను రూపంలో వచ్చే డబ్బులను రెవెన్యూ సెక్షన్‌లో పనిచేసే ముఖ్య అధికారి మొదలుకొని ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వరకు సొంతానికి వాడుకోవడం చాలాకాలంగా కొనసాగుతోంది. ఇక్కడ కూడా మున్సిపాలిటీలోని ముఖ్యనేత భర్తకు అనుమానం వచ్చి చెక్‌ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. ఇదే విషయాన్ని కమిషనర్‌కు తెలియజేసి.. ఆ తర్వాత కిందిస్థాయి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిపై కేసు, సస్పెండ్‌ చేశారు. అయితే ఇందులో రెగ్యులర్‌ ఉద్యోగులైన ముగ్గురు బిల్‌ కలెక్టర్లు, ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగి కీలకంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట జూనియర్‌ అసిస్టెంట్‌ తాను సొంతానికి వాడుకున్న రూ.10 లక్షలు మున్సిపల్‌ ఖాతాలో జమచేసినట్లు తెలిసింది.

‘పసిడి’ పరుగుల రాణి

హనుమకొండలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వప్న రెండు స్వర్ణ పతకాలు సాధించింది.

–8లో u

ముగ్గురు ఉద్యోగులపై వేటు

గద్వాల మున్సిపాలిటీలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. వివరాలిలా.. మున్సిపల్‌ షాపుల అద్దెకు సంబంధించి వసూలు చేసిన రూ.11.28 లక్షలు సంబంధిత అధికారులు మున్సిపల్‌ ఖాతాలో జమ చేయకపోవడాన్ని తీవ్ర తప్పిదంగా పరిగణిస్తూ.. కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ మంగళవారం చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహరంలో రెవెన్యూ ఆఫీసర్‌ రాజేష్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజవర్ధన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఇన్‌చార్జి షరాఫ్‌ రాజవర్ధన్‌ నాయుడులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు అదనపు కలెక్టర్‌ నర్సింగరావును విచారణ అధికారిగా నియమించారు. సంబంధిత రశీదు పుస్తకాలు, రికార్డులు, రిమిటెన్స్‌ వివరాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.

గద్వాల మున్సిపాలిటీలో అవినీతి బాగోతం

కొందరు అక్రమ వసూళ్లకు తెరలేపితే.. మరికొందరు సొంతానికి వాడుకుంటున్న డబ్బులు

ఇటీవల రూ.11 లక్షలు సొంతానికి వాడుకున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి

మరో ఘటనలో గుట్టుచప్పుడు కాకుండా

రూ.10 లక్షలు ఖాతాలో జమచేసిన

మరో జూనియర్‌ అసిస్టెంట్‌

రెవెన్యూ సెక్షన్‌లో

లంచావతారం ఎత్తిన ముఖ్య అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement