గద్వాలన్యూటౌన్: విద్యకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఒక్కరికీ కనీసంగా చదవడం, రాయడం అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో ఆదివారం జిల్లావ్యాప్తంగా రెండోవిడత నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు 28,840 మహిళలు హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో జిల్లాలోని 13 మండలాల్లో జరిగిన పరీక్షకు 33,783 మందికి గాను 26,103 మంది (77శాతం) హాజరు కాగా.. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నాలుగు మున్సిపాలిటీల్లో 3,077 మందికి గాను 2,737 మంది (89శాతం) హాజరయ్యారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటుచేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7గంటల వరకు పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. మహిళల సమయానికి అనుకూలంగా అధికారులు పరీక్ష నిర్వహించారు. ఆయా మండలాల్లో ఏపీఎంలు, సీసీలు, పట్టణాల్లో మెప్మా టీఎంసీలు పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఇటిక్యాల మండలం మునగాల పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర అబ్జర్వర్ భాస్కర్, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తనిఖీ చేశారు. ఉండవెల్లి పరీక్ష కేంద్రాన్ని డీఆర్డీఓ ముషాహిదా బేగం పరిశీలంచారు. అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటేశ్, ఏపీడీ శ్రీనివాసులు, మెప్మా ఏడీఎంసీ వెంకటేశ్వర్లు జిల్లా కేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు.


