ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు ప్రజలకు కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఇన్‌చార్జి కమాండెంట్ ఆదినారాయణ అన్నారు. ఆదివారం బీచుపల్లి పదో బెటాలియన్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇన్‌చార్జి కమాండెంట్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిగా ప్రజాసేవకు అంకితమైన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. సామాజిక న్యాయం, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో తమవంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారధిరెడ్డి, ఆర్‌ఐలు శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐలు భార్గవరెడ్డి, లక్ష్మణ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


