రాజోళి: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆదివారం ఆర్డీఎస్ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. ఇటీవల సుంకేసుల జలాశయం నుంచి టీబీ డ్యాం మధ్య కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు ప్రవహించి నదిలోకి నీరు వచ్చి చేరింది. అదే నీరు రాజోళి డైవర్షన్ స్కీం వద్ద నదిలోకి, ఆర్డీఎస్ కెనాల్‌లోకి ప్రవహిస్తున్న క్రమంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా డీ–24 కెనాల్‌కు అధికారులు నీటి పంపింగ్‌ను ప్రారంభించారు. ఇటు నదిలో నీరు ఉండటంతో పాటు ఆయకట్టుకు నీరు రావడంతో రైతులు తమ పంటలకు నీటితడులు అందించే పనిలో పడ్డారు. నదిలో నీరు వస్తుందని తెలిసినప్పటి నుంచే తమ డిస్ట్రిబ్యూటరీ వరకు వచ్చేందుకు ఎంత సమయం పడుతుందోనని లెక్కలు వేసుకున్న రైతులు.. ఆ సమయానికి తమ పొలాల్లో నీటితడులు అందించేందుకు సిద్ధమయ్యారు. తుమ్మిళ్లలోని జీరో పాయింట్ వద్ద నిర్ణీత సామర్థ్యానికి నీటిమట్టం చేరుకోగానే అప్రోచ్ కెనాల్ ద్వారా పంపింగ్ చేస్తున్నారు. తనగల సమీపంలోని డీ–23 వద్ద ఉన్న డెలవరీ సిస్టర్న్ దగ్గర ఆర్డీఎస్ కెనాల్‌లోకి నీరు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


