ఎర్రవల్లి/ధరూరు: బీచుపల్లి ఆయిల్ మిల్లులో త్వరలోనే ఆయిల్‌పాం ప్రాసెసింగ్ యూనిట్ పనులు ప్రారంభించనున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. బుధవారం బీచుపల్లి ఆయిల్ మిల్లులో ఆయిల్‌పాం ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ఫ్యాక్టరీ లే అవుట్‌ను ఖరారు చేసేందుకు టీజీ ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ సత్యనారాయణ, ప్లాంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, టెక్నికల్ మేనేజర్ ఆకుల బాలకృష్ణ తదితరులతో కూడిన సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో సందర్శించింది. ఈ సందర్బంగా ఆయిల్‌పాం యూనిట్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, యంత్రాల ఏర్పాటు, ఉత్పత్తి ప్రక్రియకు అనుగుణంగా ఫ్యాక్టరీలోని వివిధ విభాగాలను సాంకేతిక బృందం పరిశీలించింది. ముఖ్యంగా సీడ్ హౌస్‌లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన నమూనా లేఅవుట్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు. ఖరారు చేసిన లేఅవుట్‌కు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరలోనే పూర్తిచేసి, ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. ఆయిల్‌పాం ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి రావడం ద్వారా జిల్లాలో సాగు విస్తరణకు మరింత ప్రోత్సాహకం లభించడంతో పాటు రైతులకు గెలల సేకరణ, తూకం, రవాణా, ప్రాసెసింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజ్‌కుమార్ వెల్లడించారు. అదే విధంగా ధరూరు మండలం బూరెడ్డిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. కార్యక్రమంలో సివిల్ ఇంజనీర్ నరేశ్, ఏఓ శ్రీలత, రోహిత్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ విజయుడు పాల్గొన్నారు.


