ధరూరు: జూరాల ప్రాజెక్టు పరిధిలోని కుడి కాల్వకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేవులపల్లి, భీంపురం, పెద్ద చింతరేవుల తదితర గ్రామాల రైతులు రైతులు ప్రాజెక్టు రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు దాదాపు మూడు గంటల పాటు బైఠాయించారు. సాగునీటిని విడుదల చేసే వరకు కదిలే ప్రసక్తే లేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న రేవులపల్లి, పోలీసులు, పీజేపీ అధికారులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంట సాగు కంటే ముందు అధికారులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని చెప్పారని, వాటికి వారబందీ పద్ధతిలో నీరిస్తామని చెప్పి ఇప్పుడు కాల్వను పూర్తిగా మూసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు విడిచి రోజు సాగు నీరందించాలని కోరారు. అనంతరం పీజేపీ డీఈ రమేష్‌బాబు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సాగునీటి విషయంలో తామేమి చేయలేమని, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే నీటి విడుదల చేస్తామన్నారు. ధర్నా చేస్తున్న రైతులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, చింతరేవుల సర్పంచు రాజేష్ తదితరులు అక్కడికి చేరుకొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడారు. 24 గంటల్లో ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.


