ధరూరు: విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతగా ఉండాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. శనివారం ధరూరు మండలం గూడ్డెందొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న విద్య, వసతి, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తాగునీరు కలుషితం కాకుండా చూడటంతో పాటు వసతిగృహాలు, గురుకుల పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థుల కోసం వండిన వంటలను ఆయన పరిశీలించారు.


