గద్వాల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ.. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ఎల్‌నిన్ ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా జూరాల కుడి కాల్వ పరిధిలో చివరి డిస్ట్రిబ్యూటర్ కింద సాగుచేసే పంటలకు నీటి సరఫరాపై స్పష్టత ఉండాలన్నారు. పంటలు చేతికొచ్చే వరకు రైతులు నష్టపోకుండా ముందుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల భూసేకరణకు ఉన్న అన్ని అడ్డంకులను అధిగమించి, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేసి, నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని వివిధ ప్యాకేజీల కింద పెండింగ్‌లో ఉన్న భూసేకరణను వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఎస్‌డీసీ కృష్ణ, ఇరిగేషన్ సీఈ రహీముద్దీన్, ఎస్‌ఈ కేశవరావు, ఆర్డీవో శ్రీనివాసరావు ఉన్నారు.
● సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీని వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీసీలో పాల్గొన్న అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ.. సర్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి తప్పనిసరిగా అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


