మానవపాడు: ఎరువుల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాప్ విధానం రైతులకు తలనొప్పిగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేని, చదువురాని, ఫోన్ వాడకం తెలియని రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గతంలో కేవలం యూరియాకే పరిమితమైన ఆన్‌లైన్ (యాప్) విధానాన్ని అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులకు వర్తింజేయడం రైతులను మరిన్ని కష్టాలకు గురిచేస్తోంది. నిరక్షరాస్యులైన రైతులు ఇతరులపై ఆధారపడి బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కౌలు రైతుల పేర్లపై ఎరువులు బుక్ కావడం లేదు. అసలే వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతున్న రైతులు.. బోరుబావుల కింద సాగుచేసిన పంటలకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించలేక ఆందోళన చెందుతున్నారు.
అధికమైన రవాణా ఖర్చు..
గతంలో రైతులు తమ సమీప గ్రామంలోని ఫర్టిలైజర్ డీలర్ వద్దకు వెళ్లి డబ్బులు లేకపోయినా అప్పుగా ఎరువులు తెచ్చుకునేవారు. కానీ ప్రస్తుతం యాప్ విధానంలో మండలాన్ని ఒక యూనిట్‌గా కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా కాకుండా, వేరే గ్రామంలోని దుకాణాల్లో ఎరువులు బుక్ అవుతున్నాయి. ఫలితంగా రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి.
ఒకటి లభిస్తే.. మరొకటి దొరకదు
రైతులు ఎక్కువగా యూరియా, డీఏపీ కలిపి పంటలకు వినియోగిస్తారు. అయితే యాప్‌లో ఒక ఎరువు బుకింగ్ అయితే.. మరో ఎరువు బుకింగ్ కావడంలో జాప్యం జరగడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. కాంప్లెక్స్ ఎరువులు 20–20–0–13, 28–28–0, 14–35–14, 10–26–26తో పాటు ఎంఓపీ ఎరువులు సకాలంలో లభించడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్న రైతులు మాత్రమే యాప్ వినియోగించేందుకు అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 74శాతం రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. మిగతా వారితో పాటు నిరక్షరాస్యులైన రైతులు యాప్ ద్వారా ఎరువులను పొందేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు ఎరువులు కష్టాలు లేకుండా చూడాలని కోరుతున్నారు.
ఆక్రమణలో లాల్‘కోట’
చిన్నచింతకుంట మండలంలోని లాల్‌కోటలో కాకతీయుల కాలం నాటి కోట స్థలం క్రమంగా ఆక్రమణకు గురవుతోంది.
–8లో u


