గద్వాల: ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యావ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపడుతోందని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఎంసీహెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యావ్యవస్థ అధ్యయనానికి వెళ్లి వచ్చిన బృందంతో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఉపాధ్యాయులు రాబోయే ఐదేళ్లలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఒక విజన్‌తో ముందుకెళ్లాలన్నారు. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ యంగ్ ఇండియా పాఠశాలలు ప్రారంభిస్తున్నామన్నారు. టీచర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం ఫేజ్–1లో భాగంగా ఏప్రిల్‌లో ఫిన్లాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ విద్యా అధ్యయన పర్యటనలో పాల్గొన్నట్లు వెల్లడించారు. అలాగే ఫేజ్–2లో భాగంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఫిన్లాండ్, సింగపూర్, జపాన్, వియత్నాం, చైనా దేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 190 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలను పంపించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో జిల్లా నుంచి ఆరుగురు ఉత్తమ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు నామినేట్ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ ఎంపిక తన అధ్యక్షతన అదనపు కలెక్టర్, డీఈఓ, కలెక్టర్ నామినేట్ చేసిన ఓ అధికారి సభ్యులుగా ఉన్న జిల్లా స్థాయి కమిటీ నిర్వహిస్తుందన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారినే ఎంపిక చేసి.. వచ్చేనెల 7లోగా ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ తుది ఎంపిక చేస్తుందన్నారు.
ప్రస్తుతం వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నా ఎల్‌నినో ప్రభావం కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు పంటల సాగు ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ తెలిపారు. తగినంత నీటివనరులు లేని రైతులు వరిసాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని చెప్పారు. జిల్లాలో కూరగాయలతోపాటు ఆయిల్‌పాం తోటల విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు అనుసరించి పంటల సాగు ఎంపిక చేసుకోవాలని సూచించారు.


