గద్వాల న్యూటౌన్: సీపీఎస్‌ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో జిల్లాకేంద్రంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి జరిగే జనజాగరణ యాత్రను విజయవంతం చేయాలని సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నర్సింహ కోరారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల ఆవరణలో యాత్ర వాల్‌పోస్టర్లు విడుదల చేసి మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఐదేళ్ల కోసం ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు జీవితాంతం పెన్షన్ ఉంటుంది.. కానీ, 30 ఏళ్లపాటు సేవలందించే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. జనజాగరణ యాత్రకు రాష్ట్ర నాయకులు వస్తారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎం విష్ణు, నాయకులు ఆంజనేయులు, మురళీధర్‌రెడ్డి, రాఘవేంద్ర, షేక్షావళి, కృష్ణ, గజేంద్రనాథ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


