గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 26మంది తమ సమస్యలను ఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించిన ఎస్పీ.. ఆయా సమస్యలపై విచారణ చేపట్టి, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
పల్లీ క్వింటా రూ.7,302
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు సోమవారం 3,204 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,302, కనిష్టంగా రూ. 2,019, సరాసరి రూ. 5,890 ధరలు పలికాయి.
నిబంధనలు
ఉల్లంఘిస్తే చర్యలు
అయిజ: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. సోమవారం అయిజలోని కర్నూలు–రాయచూర్ రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధ్రువపత్రాలను పరిశీలించారు. ధ్రువపత్రాలు లేని పలు వాహనాలకు జరిమానాలు విధించారు. ఆయన వెంట సిబ్బంది నర్సన్నగౌడ్ ఉన్నారు.
జూరాల–గద్వాల రాకపోకలు నిలిపివేత
అమరచింత(ఆత్మకూర్): ఆత్మకూర్ మండలంలోని జూరాల గ్రామ సమీపంలో ఉన్న కృష్ణానది నుంచి గద్వాలకు వెళ్లే కచ్చా రహదారిపై వాహనాల రాకపోకలను సోమవా రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఎస్‌ఐ జయన్న తెలిపారు. జూరాల పవర్ ప్లాంట్ నుంచి నీటిని విడుదల చేస్తున్నందున జూరాల గ్రామం మీదుగా గద్వాలకు వెళ్తే మార్గాన్ని మూసివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని తమ ప్రయాణాలను కొనసాగించుకోవాలని సూచించారు.


