‘రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సమకూరే సంతగా పెబ్బేరు సంతకు పేరుంది. పుర ఖజానాకు చేరాల్సిన రూ.కోట్ల ఆదాయం కొందరు అక్రమార్కులు దోచేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడి అధికార పాలకవర్గం నిద్రావస్థలో ఉండటంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఆదాయాన్ని కొల్లగొడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ విషయాన్ని మీడియా, పలు రాజకీయ పార్టీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించడం లేదు.’
వనపర్తి: పెబ్బేరులోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 30.19 ఎకరాల భూమిలో 16 దశాబ్దాలుగా ప్రతి శనివారం వారాంతపు సంత కొనసాగేది. సంతపై వచ్చే ఆదాయాన్ని నాడు పంచాయతీ, నేడు పుర పాలకవర్గం తీర్మానం మేరకు పట్టణాభివృద్ధికి వెచ్చించడం ఆనవాయితీ. ఈ స్థలం తమదంటూ ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మధ్యలో కొన్నేళ్లపాటు కోర్టులో కేసు నడుస్తోంది. నాలుగేళ్ల క్రితం తీర్పు వెలువడగా.. నాటి నుంచి ఇప్పటి వరకు ఏటా నిర్వహించే సంత వేలం నిలిపివేశారు. చివరిసారి నిర్వహించిన వేలంలో పురపాలికకు రూ.కోట్లలోనే ఆదాయం సమకూరింది.
సీపీఎం నాయకుల ఫిర్యాదుతో వెలుగులోకి..
ఇటీవల సీపీఎం జిల్లా కమిటీ నాయకులు పలువురు పెబ్బేరు సంతలో అక్రమార్కులు చేస్తున్న దోపిడీతో పాటు పురపాలిక పేరుతో ముద్రించిన నకిలీ రసీదుల విషయాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరోసారి పెబ్బేరు సంత ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుందనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై పుర అధికార, పాలకవర్గం స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచారించి చర్యలు తీసుకుంటాం..
కొందరు అక్రమార్కులు పుర కార్యాలయం పేరిట రసీదులు ముద్రించి సంతలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. విచారించి చర్యలు తీసుకుంటాం. గతంలో వీరిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సంతకు ప్రభుత్వ స్థలం లేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న స్థలం కోర్టు కేసులో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్తాం.
– గణేష్, పుర కమిషనర్, పెబ్బేరు
త్వరలోనే పరిష్కారం..
సంత స్థల వివాద పరిష్కారానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృషి చేస్తున్నారు. కోర్టు తీర్పు వరకు వేచి చూ డాలి. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. పురపాలికకు చెల్లించే సొమ్ము వేణుగోపాలస్వామి ట్రస్ట్ పేరిట బ్యాంకులో జమ చేస్తున్నాం.
– అక్కి శ్రీనివాస్‌గౌడ్, పుర చైర్మన్, పెబ్బేరు
గతంలో టెండర్లు నిర్వహించగా వారానికి రూ.6.36 లక్షల చొప్పున పురపాలికకు చెల్లించాలని నిర్ణయించారు. మున్సిపాలిటీకి సమకూరే ఆదాయంలో వారాంతపు సంత, తైజజారే అత్యధికం, పశువు ఒక్కింటికి రూ.100, గొర్రె, మేకకు రూ.10 నుంచి రూ.50 వరకు, తైబజారు రూ.10 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. తైబజార్ వసూలు చేసేందుకు పశువులు, మేకలు, గొర్రెలకు వేర్వేరుగా కాంట్రాక్టర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంత నిర్వహించే స్థలాన్ని రెవెన్యూశాఖకు అప్పగిస్తే.. అంతే స్థలాన్ని మరోచోట చూపించేలా అర్చకులు ఒప్పందం కుదుర్చుకొని హక్కులు మార్చుకున్నారు. కాగా సంత స్థలం వదులుకున్న అర్చకులకు రెవెన్యూశాఖ భూమి చూపించకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆ స్థలంలో క్రయ విక్రయాలు జరగకుండా, టెండర్లు నిర్వహించకుండా నిషేధం విధించడంతో అక్రమార్కులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. పట్టణంలోని వివిధ దుకాణాలకు వచ్చే ఆటోలు, ట్రాన్స్‌పోర్ట్ లారీలు, డీసీఎంల వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
వారానికి రూ.6.36 లక్షలు..
పెబ్బేరులో ఏళ్లుగా నిలిచినసంత బహిరంగ వేలం
కోర్టు వివాదంతో నిలిపివేత
అక్రమార్కుల చేతికి ఆదాయం
నకిలీ రసీదులతో వసూళ్లకు తెగబడిన వైనం
నిద్రావస్థలో పాలకవర్గం


