ఆగని ఇసుక అక్రమ దందా | - | Sakshi
Sakshi News home page

ఆగని ఇసుక అక్రమ దందా

Oct 5 2026 12:15 AM | Updated on Oct 5 2026 12:15 AM

● తాజాగా సరిహద్దులోభారీ డంపు గుర్తింపు

● బల్గెర, చమన్‌ఖాన్‌దొడ్డి కేంద్రాలుగా యథేచ్ఛగా కార్యకలాపాలు

● సరిహద్దుల్లోంచి పక్క మండలాలకు తరలింపు

గట్టు: ఇసుక అక్రమ దందాకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఈ వ్యాపారం మూడు ట్రాక్టర్లు.. ఆరు డంపులుగా సాగుతోంది. తాజాగా శనివారం కర్ణాటక– తెలంగాణ సరిహద్దులోని ముసలంపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును రెవెన్యూ, పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. 12 ట్రాక్టర్‌ ట్రిప్పుల ఇసుకను రిజర్వు ఫారెస్టుకు చెందిన సర్వే నం.38లో డంపులను ఏర్పాటు చేసుకుని విక్రయాలను కొనసాగిస్తుండగా అధికారులు గుర్తించారు. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ పోలీసులను మచ్చిక చేసుకుని తుంగభద్ర నది నుంచి కర్ణాటక మీదుగా టిప్పర్ల ద్వారా ఇసుకను తీసుకువచ్చి తెలంగాణ సరిహద్దులో అక్రమంగా నిల్వ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మళ్లీ గట్టు, కేటీదొడ్డి, మల్దకల్‌, అయిజ మండలాల్లోని వివిధ గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. గట్టు మండల పరిధిలో ఎలాంటి నది లేకపోయినా ఇసుక మాత్రం పుష్కలంగా లభిస్తోంది. ఆరు నెలల క్రితం చమన్‌ఖాన్‌దొడ్డి శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 10 టిప్పర్ల ఇసుక డంపును కలెక్టర్‌ చొరవతో రెవెన్యూ అధికారులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించి సీజ్‌ చేశారు. మళ్లీ ఇదే ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఏకంగా రిజర్వు ఫారెస్టుకు చెందిన భూమిలో ఇసుక డంపు చేయడం గమనార్హం.

సామాన్యులకు చుక్కలు..

సామాన్యులు ఇసుక దొరకక అవస్థలు పడుతుంటే కొందరు ఇసుక వ్యాపారం చేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్‌ డిమాండ్‌ను బట్టి రూ.3,500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో కర్ణాటక సరిహద్దులోని చమన్‌ఖాన్‌దొడ్డి శివారులో 10 టిప్పర్ల ఇసుక డంపును కలెక్టర్‌ చొరవతో సీజ్‌ చేసినా.. ఇప్పటి వరకు దీని వెనుక ఉన్నది ఎవరో తేల్చలేకపోయారు. పోలీసులు కేవలం కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇసుక అక్రమ వ్యాపారం ఎవరు చేశారనేది అందరికీ తెలిసినా పోలీసులు మాత్రం మాకేం తెలియదు అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు పోలీసులకు నెలవారి మామూళ్లు ముట్టజెప్పడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement