గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించకుండా అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలను పేర్కొంటూ ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్జ్‌మెంట్‌ను పంపాలన్నారు. అదే విధంగా మండలాల్లో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తే, చిన్నచిన్న సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. కాగా, ప్రజావాణిలో 52 ఫిర్యాదులు అందగా.. ఆయా శాఖల అధికారులకు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ట్రెయినీ డీసీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


