మూడు విడతల్లో యూరియా బుకింగ్
● ప్రతి విడతకు 20 రోజుల వ్యవధి
● నిబంధనల్లో మార్పులు, చేర్పులతో ఇక్కట్లు
● యాప్ వాడలేని గ్రామీణ రైతుల అవస్థలు
● కౌలుదారుల
పరిస్థితి మరింత
దయనీయం
20 రోజులు ఆగాలంటే ఎలా
ప్రభుత్వం తెచ్చిన కొత్త యూరియా బుకింగ్ విధానంపై గ్రామీణ రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా వద్దనేమో స్మార్ట్ ఫోన్ లేదు. యాప్ అంటే ఏంటో తెలియదు. దీనికితోడు ఒకసారి యూరియా తీసుకుంటే తర్వాత 20 రోజులు ఆగాలంటే ఎలా. పాత పద్ధతిలోనే డీలరు దగ్గర నేరుగా అమ్మకాలు చేయాలి.
– బీచుపల్లి, రైతు, గోకులపాడు
గందరగోళంగా ఉంది..
మా ఊరిలో సిగ్నల్స్ సమస్య. నా కొడుకు ఊరిలో లేకపోతే బుకింగ్ చేసుకోలేం. మూడు విడతల్లో అంటే గందరగోళంగా ఉంది. డీలర్ల ద్వారా త్వరగా యూరియా తీసుకునేవాళ్లం. 20 ఎకరాలకు పైగా భూమి ఉంది. కౌలుకు పొలం తీసుకున్నా యూరియా యాప్ ద్వారా బుక్ చేయాలంటే ఇబ్బందులు పడుతున్నాం.
– గొల్ల వెంకట్రాములు, రైతు, మానవపాడు
ఆఫ్‌లైన్‌లో ఇవ్వాలి
యూరియా పంపిణీలో పారదర్శకత కోసం తెచ్చిన యాప్ విధానం రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతుకు యాప్ వాడడం రాదు. ప్రతి సొసైటీలో ఒక సహాయ కేంద్రం పెట్టి ఆఫ్‌లైన్ బుకింగ్ ఇవ్వాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. – పుల్లన్న, రైతు, బైరాపురం
మానవపాడు: అన్నదాతలకు సాగు పనులు మొదలుకొని.. విత్తనాల సేకరణ, యూరియా కొనుగోళ్లు, పంటలకు సాగునీరు, ధాన్యం అమ్మకాల వరకు ఇలా అడుగడుగునా కష్టాలు ఎడతెగడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీ విధానంలో తీసుకువచ్చిన కొత్త నిబంధనలు గ్రామీణ రైతులకు మరింత ఇబ్బందికరంగా మారాయి. యూరియా కొరతను నివారించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ ఆధారిత బుకింగ్ విధానం రైతులకు శాపంగా మారింది. కొత్త నిబంధనలు ఒకవైపు.. మరోవైపు గ్రామీణ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల మూడు విడతల్లో యూరియా బుకింగ్ విధానాన్ని అమలు చేసింది. భూమి విస్తీర్ణం ఆధారంగా బుకింగ్ చేయాల్సి ఉండగా.. 2 ఎకరాల వరకు ఉన్న రైతులు ఒకేసారి పూర్తి యూరియా బుక్ చేసుకోవచ్చు. 2–5 ఎకరాల రైతులు 50– 50 శాతం చొప్పున రెండు విడతల్లో, 5 ఎకరాల పైబడిన వారు 40– 30– 30 శాతం చొప్పున మూడు విడతల్లో బుక్ చేసుకోవాలి. అత్యంత కీలకమైన నిబంధన ఏమిటంటే ప్రతి విడతకు 20 రోజుల వ్యవధి తప్పనిసరి. ఈ గ్యాప్‌తో పంటకు సరైన సమయంలో యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొరత లేకుండా అందరికీ సమానంగా అందించే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసినా అవి క్షేత్రస్థాయి ఆచరణలో కష్టంగా మారాయి.
13 వేల టన్నుల నిల్వలు..
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాకు 24 వేల టన్నుల యూరియా అవసరమవుతందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం జిల్లాలో 13 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప తెలిపారు. ప్రస్తుతం వానాకాలంలో యూరియా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని పేర్కొన్నారు. అలాగే ఎల్‌నినో దృష్ట్యా పంటల సాగు విస్తీర్ణం తగ్గితే యూరియా అమ్మకాలు తగ్గుతాయని భావిస్తున్నారు.


