సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పాలన | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పాలన

Jul 14 2026 12:48 AM | Updated on Jul 14 2026 12:48 AM

రహదారుల నిర్మాణానికి పెద్దఎత్తున నిధుల విడుదల

రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రూ.339.39 కోట్లతో హ్యామ్‌ రోడ్ల పనులకు శంకుస్థాపన

ధరూరు: రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లావ్యాప్తంగా చేపట్టే రోడ్ల మరమ్మతు, విస్తరణకు సంబంధించి రూ.339.39 కోట్లతో చేపట్టే హ్యామ్‌ రోడ్ల పనులకు రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధరూరులో శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, కొత్తగా రేషన్‌ కార్డులు ఇవ్వడంతోపాటు 3.18 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. గృహజ్యోతి పథకంతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించడం జరుగుతుందన్నారు. కోటి మంది మహిళలకుకోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్రోలు బంకుల ఏర్పాటు, ఆర్టీసీ బస్సుల కేటాయింపు వంటివి కల్పిస్తున్నామన్నారు. ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడంతో మహిళా సంఘాలకు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చిందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచడం ద్వారా కరువును పారద్రోలి తాగు, సాగునీటిని అందించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తయితే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగు నీరందించవచ్చని చెప్పారు. ప్రతి కుటుంబంలో ఆడపిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేయాలన్నారు. మహిళా, రైతు, యువజన సంఘాల అభివృద్ధిలో ప్రతిఒక్కరు భాగస్వామలు కావాలన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. గతంలోనూ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సరిత, వాల్మీకి బోయ కార్పొరేషన్‌ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌, నాయకులు సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement