గద్వాలన్యూటౌన్: జిల్లాలో చేనేత పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. జిల్లాలో మొత్తం 16 చేనేత సంఘాలు ఉండగా.. 10 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు గద్వాల, మాచర్ల, అయిజ, ఎక్లాస్‌పూర్, రాజోళి, ఆరగిద్ద చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా రాష్ట్ర సహకార ఎన్నికల ప్రాధికార సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల విషయంలో ఓటర్లు అయోమయానికి గురికాకుండా పురుష అభ్యర్థులకు తెలుపు బ్యాలెట్, మహిళా అభ్యర్థులకు పింక్ కలర్ బ్యాలెట్ ఇచ్చారు. ఓటర్లు తెలుపు బ్యాలెట్‌లో ఏడు గుర్తులపై, పింక్ బ్యాలెట్‌లో రెండు గుర్తులపై ఓటు వేసేలా ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. అన్నిచోట్ల పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగినట్లు చేనేత, జౌళీశాఖ అధికారులు తెలిపారు. కాగా గెలుపొందిన డైరెక్టర్లు మూడు రోజుల తర్వాత ఆయా చేనేత సహకార సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు.


