మచ్చుకు కొన్ని ఘటనలు..
లైసెన్స్ లేకుండానే..
జిల్లాలో నిత్యకృత్యమైన రోడ్డు ప్రమాదాలు
● మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు
డ్రైవింగ్‌తోనే అనర్థాలు
● గడిచిన ఆరు నెలల వ్యవధిలో
54 మంది మృతి
● అవగాహన కల్పిస్తున్నా మారని
కొందరు డ్రైవర్లు
● నివారణ చర్యలపై పోలీస్ శాఖ కసరత్తు
గద్వాల క్రైం: జిల్లాలో రోడ్డు ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. వాహనాలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా వస్తే చాలనుకునే స్వరం వినిపిస్తోంది. మరోవైపు అవగాహన లేని డ్రైవర్లు వాహనాలను వాయువేగంతో నడుపుతూ ప్రమాదాల కారకులవుతున్నారు. జాతీయ, రాష్ట్ర, పట్టణ రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. జిల్లాలోని ధరూరు, మానవపాడు, ఇటిక్యాల, అలంపూర్, అయిజ మండలాల్లో ఇటీవల అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గడిచిన ఆరు నెలల వ్యవధిలో 54 మంది మృతి చెందగా.. 70మందికి పైగా గాయాలపాలయ్యారంటే.. ప్రమాదాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఏటా జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు, పోలీసు శాఖ అరైవ్– అలైవ్ కార్యక్రమాల ద్వారా చైతన్యం తీసుకువచ్చినప్పటికీ కొందరు డ్రైవర్లు, వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
నిర్లక్ష్యపు వైఖరితోనే..
వాహనాలు నడపడం ఎంత సరదానో.. అంతకంటే మనిషి ప్రాణం ముఖ్యం అనే విషయాన్ని కొందరు డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. వాహనాన్ని రోడ్డుపై ఎంత స్పీడ్‌గా వెళ్లాలి.. ఎటు నుంచి వాహనాలను ఓవర్‌టెక్ చేయాలి.. ఎదురుగా వస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా ఎలా బయట పడాలి అనే విషయాలపై ఏమాత్రం అవగాహన పెంచుకోవడం లేదు. కొందరు యువ డ్రైవర్లు వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతూ ఎదురుగా వచ్చే వాహనాలను ప్రమాదాలకు గురిచేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
13.04.2026న నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన నలుగురు స్నేహితులు గోవా నుంచి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలోని వీరాపురం గ్రామ శివారులో డ్రైవింగ్ చేస్తున్న యువకుడు నిద్రలోకి జారుకోవడంతో రోడ్డు పక్కనున్న భారీ వృక్షాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
12.05.2026న గద్వాల పట్టణానికి చెందిన ఓ యువకుడు బైక్‌పై కర్నూలు వైపు వెళ్తుండగా.. ఇటిక్యాల శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
06.6.2026న కేటీదొడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం ఓ గూడ్స్ వాహనంలో గద్వాలకు వస్తుండగా.. గోనుపాడు గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలవడంతో జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇలా గడిచిన ఆరు నెలల వ్యవధిలోనే 54 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందగా.. 70 మందికి పైగా గాయాల పాలయ్యారు.
వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావాలంటే ముందుగా దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. రవాణా శాఖ అధికారులచే లైసెన్స్ తీసుకోవాలి. రాత్రివేళలో హెడ్ ల్యాంపు, ఇండిగేటర్లు వేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలకు ముందుగా సంకేతాలు ఇవ్వాలి. కానీ, కొందరు వాహనాలు ఎంత త్వరగా వెళ్తే.. అంత గొప్ప డ్రైవర్‌గా ఊహించుకుంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం పరిపాటిగా మారింది. అయితే వివిధ వాహనాలు నడపాలంటే లైసెన్స్ ఉండాలి. కానీ, కొంతమంది డ్రైవింగ్ రాకున్నా రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్స్‌లు పొందడం కొసమెరుపు. ముందుగా ఇలాంటి వారిని కట్టడి చేస్తే కొంత వరకై నా ప్రమాదాలు నివారించవచ్చు.


