బ్యాంకు గ్యారంటీలపై ఉదాసీనతేనా..?
విచారణ చేపడతాం..
రూ.కోట్ల బకాయి ఉన్న మిల్లర్‌కు రవాణా కాంట్రాక్టు..
రైస్‌మిల్లులపై వరుస టాస్క్‌ఫోర్స్ దాడులు
● కనిపించని రూ.కోట్ల విలువజేసే
వరి ధాన్యం
● తూతూమంత్రంగా జిల్లాస్థాయి
అధికారుల చర్యలు
● చేసేది లేక రాష్ట్రస్థాయి
ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
●
వనపర్తి: జిల్లాలో గడిచిన పదేళ్లలో వరి సాగు, ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెరగగా.. అంతేస్థాయిలో ధాన్యం నిల్వల మాయం, కేటాయింపుల్లో లోపాలు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలు సైతం పెరిగాయి. కొంతకాలంలో జిల్లా నుంచి టాస్క్‌ఫోర్స్ అధికారులకు తరుచూ వెళ్తున్న ఫిర్యాదులతో వరుస దాడులు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం గమనార్హం. కొన్ని మిల్లుల్లో రూ.కోట్ల విలువజేసే ధాన్యం కాగితాల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాయం చేస్తూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు.
2025, నవంబర్ 13న పెద్దమందడి మోజర్ల సమీపంలోని రెండు మిల్లుల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా.. సుమారు రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించి మిగతా ధాన్యాన్ని సీజ్ చేశారు. గత నెల 22న తిరిగి అవే మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన మిగులు ధాన్యం నిల్వలను పరిశీలిస్తే సుమారు రూ.9 కోట్ల విలువజేసే ధాన్యం అక్కడ లేకపోవడం విస్మయానికి గురిచేసింది. సీజ్ చేసిన ధాన్యం ఎలా మాయమవుతుందనే విషయంపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, రూ.కోట్ల విలువజేసే ధాన్యం సంరక్షించాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించడానికి విముఖత చూపిస్తున్నారు.
కొత్తకోట మండలం నాచాంపేట శివారులోని ఓ కొత్త మిల్లుకు గత సీజన్‌లో రూ.6.50 కోట్ల వరి ధాన్యం అధికారులు కేటాయించారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 9న టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. సుమారు రూ.2.50 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఇది చూసిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క.. రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటూ బియ్యం అడిగినప్పుడు రీసైక్లింగ్ పద్ధతిన సీఎస్‌సీకి అప్పగిస్తూ ఒక ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది.
అధికారులపై ఫిర్యాదుల వెల్లువ..
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వరుస టాస్క్‌ఫోర్స్ దాడులు జరిగిన మిల్లుల్లో వరి ధాన్యం నిల్వలు మాయం కావడంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా అవినీతి బాగోతం రాజధాని చేరినట్లయింది. ఈ విషయంపై వారు స్పందించి సమగ్ర విచారణ చేస్తారా? లేక జిల్లా అధికారుల మాదిరిగానే నిమ్మకుంటారనే విషయంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయాలంటే కనీసం పదిశాతం బ్యాంకు గ్యారెంటీ బాండ్లు ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చింది. కానీ జిల్లాలోని కొందరు మిల్లర్లపై అధికారులు ఉదాసీనత కనబరుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేసిన నాచారంపేట శివారులోని మిల్లు యజమాని కేవలం రూ.10 లక్షల బ్యాంకు గ్యారంటీ చెల్లిస్తే రూ.కోటి విలువ చేసే ధాన్యం మాత్రమే ఇవ్వాలి. కానీ అధికారులు సుమారు 6.50 కోట్ల ధాన్యం కేటాయింపులు చేయడం ఆరోపణలకు బలం చేకూరినట్లుగా భావించాల్సి వస్తుంది.
ధాన్యం కేటాయింపులు, కొన్ని మిల్లుల్లో నిల్వలు లేకపోవడం తదితర అంశాలపై కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికాగానే విచారణ చేపడతాం. అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. బ్యాంకు గ్యారంటీ విలువ ఆధారంగానే ధాన్యం కేటాయింపులు చేయాలనే నిబంధన ఉంది. కొనుగోలు కేంద్రాలకు అత్యధికంగా ధాన్యం రావడంతో కొన్నిసార్లు ఎక్కువ మోతాదులో కేటాయింపులు చేయాల్సి వచ్చింది.
– వినోద్‌కుమార్, అదనపు కలెక్టర్, వనపర్తి
జిల్లాలోని శ్రీరంగాపురం మండలానికి చెందిన ఓ మిల్లర్ ప్రభుత్వం నుంచి సుమారు రూ.120 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకున్నారు. అందులో కనీసం పదిశాతం బియ్యం కూడా ఇవ్వలేదు. ఆయనకే కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపు కాంట్రాక్టును అధికారులు అప్పగించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకులు పలుమార్లు విమర్శలు చేసినా.. కనీసం విచారణ చేపట్టకపోవడం గమనార్హం.


