ఎర్రవల్లి: ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను సాగుచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప సూచించారు. సోమవారం ఎర్రవల్లి మండలం ధర్మవరం రైతువేదికలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. రైతులు పంటల సాగులో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోవద్దన్నారు. ప్రత్యామ్నాయ పంటలైన పెసర, మినుములు, జొన్న, వేరుశనగ, ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని తెలిపారు. సబ్సిడీపై అందించే జిప్సం, జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయ పొలాల్లో పంటల అవశేషాలను కాల్చవద్దని తెలిపారు. పంటల అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గడంతో పాటు పర్యావరణం దెబ్బతింటుందన్నారు. వర్షాకాలం వస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో ఉద్యానశాఖ అధికారిణి ఇమ్రానా, ఏఓ సురేశ్‌గౌడ్, ఆర్‌ఐ శ్రీను, కార్యదర్శి నాగరాజు, ఏఈఓ వేదావతి తదితరులు ఉన్నారు.


