అయిజ: కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా అటకెక్కించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ రజనీకాంత్‌రెడ్డికి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇదే విధమైన పాలన కొనసాగిస్తే భవిష్యత్‌లో ప్రజల తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రారెడ్డి, భీమసేనరావు, మహేష్, భగత్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, రాజశేఖర్, భీమన్న తదితరులు పాల్గొన్నారు.


