అలంపూర్: నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే విజయుడు అసెంబ్లీలో కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం అలంపూర్ నియోజకవర్గ స్థానిక సమస్యలపై ప్రస్తావించినట్లు తెలిపారు. నియోజకవర్గం రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో అభివృద్ధికి దూరంగా ఉన్నామన్నారు. అత్యవసర వైద్య సేవలు అందక, ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అత్యవసర సేవల కోసం హైదరాబాద్‌కు రావాలంటే కనీసం 250 కి.మీ ప్రయాణించాల్సి రావడంతో సకాలంలో వైద్య అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలంపూర్ చౌరస్తాలో వంద పడకల ఆస్పత్రి ఉన్నా.. వైద్య సిబ్బంది లేక సేవలు అందడం లేదన్నారు. అదేవిధంగా డయాలసిస్, కేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పొరుగున ఏపీలోని కర్నూల్‌లో పేద, మధ్య తరగతి, జర్నలిస్టులకు, ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అయిజ మున్సిపాలిటీలో అగ్రిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ప్రోటోకాల్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు
అలంపూర్: ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు స్పీకర్ గడ్డం వినోద్‌కు ఫిర్యాదు చేశారు. అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తనకు అధికారులు అధికారిక కార్యక్రమాల ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అందజేస్తున్న రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందులకు ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


