అడ్డాకుల: చట్టాలపై అందరూ అవగాహన పెంంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామంలో బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. హెల్ప్ లైన్ సెంటర్ 15100కు డయల్ చేసి న్యాయ సహాయం కోసం తగిన సలహాలు పొందవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, చిన్న పిల్లలు, మానసిక, శారీరక దివ్యాంగులు, అనాధలు, సీనియర్ సిటిజన్ల కేసుల కోసం ఉచితంగా న్యాయవాదులను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. న్యాయ సహాయం కోసం మొదట పారా లీగల్ వలంటీర్లను సంప్రదించాలని కోరారు. రైతులకు సంబంధించిన చట్టాల గురించి వారికి అవగాహన కల్పించారు. మూసాపేటలోని అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్‌కు వెళ్లి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలని, సమాజంలో అందరు సత్ప్రవర్తనతో మెలగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వి.రాంచందర్, పంచాయతీ కార్యదర్శి సురేష్, ఉప సర్పంచ్ దేవుని శ్రీను, లీగల్ వాలంటీర్ బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.


