జిల్లా అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

Mar 18 2026 11:17 AM | Updated on Mar 18 2026 11:17 AM

మౌలిక వసతులు కల్పించాలి

గద్వాల: జిల్లా జనాభాలో మహిళలే అధికంగా ఉండగా.. ఉద్యోగుల్లో సైతం మహిళల సంఖ్య ఎక్కువేనని.. అందరూ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌.. జ్యోతిప్రజ్వలన, తెలంగాణ గీతాలపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధికంగా బాల్యవివాహాలు చేస్తున్నారని, దీనివల్ల అనేక దుష్ప్రరిణామాలు ఎదురవుతాయన్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో పోక్సో కేసులు అధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. బాలికలకు గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. వరకట్న వేధింపులు ఇతర సమస్యలపై మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తేనే దోషులకు శిక్షపడుతున్నారు. సఖి కేంద్రంలో కౌన్సెలింగ్‌ వారికి అవసరమైన సాయం అందిస్తున్నామన్నారు. అదే విధంగా మహిళల అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన మహిళలు ప్రసగించారు. మహిళా సంక్షేమంపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అంతకు ముందు పలు విద్యాసంస్థలకు చెందిన విద్వార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, ఏఎస్పీ శంకర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ నుషిత, డీడబ్ల్యూఓ సునంద, డీఈఓ విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి పాల్గొన్నారు.

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. కేజీబీవీల్లో పటిష్ట భద్రత ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అనుమతి లేనిది బయటి వ్యక్తులను అనుమతించరాదన్నారు. అదే విధంగా పరిశుభ్రత, సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన భోజనం వంటివి తప్పకుండా కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, డీఈఓ విజయలక్ష్మి, మధుసూదన్‌, అంపయ్య ఉన్నారు.

సీఎం కప్‌ క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులను కలెక్టర్‌ శాలువాలతో సత్కరించి అభినందించారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ కృష్ణయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement