గద్వాల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లకు రూ. 18వేల వేతనం ఇచ్చేలా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించాలని సీఐటీయూ నాయకుడు ఉప్పేరు నర్సింహ డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశావర్కర్లతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అక్కడే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదన్నారు. ఆశావర్కర్లకు కేంద్ర ప్రభుత్వం రూ.1,500 పారితోషికం పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదన్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 28న చలో హైదారాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, కాంతమ్మ, పద్మ, సరస్వతి, శశికళ, నర్సమ్మ, మేరీ తదితరులు పాల్గొన్నారు.


